మరింత సరళంగా జీఎస్టీ!

25 Dec, 2018 00:32 IST|Sakshi

12, 18 శాతం శ్లాబులను కలిపేయాలన్న జైట్లీ

క్రమబద్ధీకరణ అవసరమని అభిప్రాయం

31 శాతం పన్నుతో దేశాన్ని కాంగ్రెస్‌ అణచేసిందని విమర్శ

న్యూఢిల్లీ: త్వరలో జీఎస్టీ మరింత సరళంగా మారనున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంకేతాలిచ్చారు. జీఎస్టీలో 12, 18% పన్ను శ్లాబులను ఒక్కటి చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.‘‘ఆదాయం పెరుగుదల నేపథ్యంలో సాధారణ వినియోగ వస్తువులకు 12–18% మధ్య ఒక్క టే ప్రామాణిక పన్ను రేటును భారత్‌ కలిగి ఉండాలి. కనీస అవసరాలపై సున్నా శాతం, ఐదు శాతం పన్నుతోపాటు, లగ్జరీ ఉత్పత్తులపై ఉన్న 28 శాతం పన్ను రేటు కూడా ఉంటాయి’’ అని జైట్లీ చెప్పారు. ఈ మేరకు ‘18 నెలల జీఎస్టీ’ పేరుతో ఫేస్‌బుక్‌లో మంత్రి ఓ పోస్ట్‌ పెట్టారు. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘‘1216 కమోడిటీలు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. ఇందులో 183పై సున్నా పన్ను రేటు అమలవుతోంది. 308 కమోడిటీలపై 5%, 178పై 12%, 517పై 18% రేటుంది. సంపన్న, హానికారక వస్తువులు, ఆటో విడిభాగాలు, డిష్‌ వాషర్లు, ఎయిర్‌ కండిషనర్లు (ఏసీలు), సిమెంట్‌పై 28% పన్ను ఉంది. జీఎస్టీకి మారడం పూర్తవడంతో మొదటి విడత రేట్ల క్రమబద్ధీకరణకు చేరువయ్యాం. సంపన్న, హానికారక వస్తువులపై తప్ప మిగిలిన వాటిపై 28 శాతం పన్ను రేటు తొలగిస్తాం’’ అని అరుణ్‌ జైట్లీ తన పోస్ట్‌లో వివరించారు. 28% రేటులో సాధారణంగా వినియోగించే సిమెంట్, ఆటో విడిభాగాలే ఉన్నాయని, తదుపరి భేటీలో సిమెంట్‌ను 28 శాతం నుంచి మార్చుతామని చెప్పారు. 12, 18 శాతం పన్ను రేట్ల స్థానంలో మధ్యస్థంగా ఒకటే రేటుకు రోడ్‌మ్యాప్‌ రూపొందించాల్సి ఉందని, ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. పన్ను ఆదాయం భారీగా పెరగాల్సి ఉందన్నారు.  

పన్నులు తగ్గాయి 
జీఎస్టీపై వస్తున్న విమర్శలను జైట్లీ తిప్పికొట్టారు. నూతన పన్ను చట్టంతో పన్ను రేట్లు దిగిరావడంతోపాటు, ద్రవ్యోల్బణం, ఎగవేతలు తగ్గుముఖం పట్టాయన్నారు. ‘‘పన్ను రేట్లు తగ్గాయి. పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది. అధిక వసూళ్లు, వ్యాపారం సులభతరం అయ్యాయి. పన్ను క్రమబద్ధీకరణ అధిక భాగం పూర్తయింది. వృద్ధి శాతం రానున్న సంవత్సరాల్లో పెరుగుతుంది’’ అని జైట్లీ చెప్పారు. గత శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం 23 వస్తువులపై జీఎస్టీ రేటును తగ్గిస్తూ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో పలు వస్తువులను 28% రేటు నుంచి తక్కువ రేటు పరిధిలోకి తీసుకొచ్చింది. ‘‘దేశాన్ని 31% పరోక్ష పన్ను రేటుతో అణచేసిన వారు జీఎస్టీని తప్పకుండా పరిశీలించి ఉండాల్సింది. బాధ్యతలేని రాజకీయాలు, బాధ్యతారాహిత్య ఆర్థిక విధానాలు పతనానికే దారితీస్తాయి’’ అంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు. జీఎస్టీ ఆదాయం గురించి వివరిస్తూ... ఆరు రాష్ట్రాలు ఆదాయ వృద్ధి లక్ష్యాలను చేరుకున్నాయని, ఏడు రాష్ట్రాలు లక్ష్యానికి సమీపంలో ఉన్నాయని చెప్పారు. ఇక ఆదాయ వసూలు లక్ష్యాలకు 18 రాష్ట్రాలు దూరంలో ఉండిపోయినట్టు పేర్కొన్నారు. మొదటి ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు నెలవారీ సగటున రూ.89,700 కోట్లుగా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.97,100 కోట్లకు పెరుగుతాయని  ఆయన చెప్పారు.

హెచ్‌యూఎల్‌ 383 కోట్ల అక్రమ లాభార్జన 
రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేయలేదని గుర్తింపు 
న్యూఢిల్లీ: జీఎస్టీలో పన్ను రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా అగ్రగామి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) రూ.383 కోట్ల మేర అక్రమంగా లాభాన్ని గడించినట్టు జీఎస్టీలోని అక్రమ లాభాల వ్యతిరేక విభాగం (ఎన్‌ఏఏ) గుర్తించింది. చాలా ఉత్పత్తులపై పన్ను రేటును 28% నుంచి 18%కి తగ్గించినప్పటికీ, ఆ మేరకు రేట్లను తగ్గించకుండా హెచ్‌యూఎల్‌ పూర్వపు అమ్మకపు ధరలకే విక్రయించింది. దీంతో హెచ్‌యూఎల్‌ రూ.383.55 కోట్ల మేర ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు నిరాకరించినట్టు ఎన్‌ఏఏ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మొత్తంలో సగం మేర అంటే రూ.191.68 కోట్లను వినియోగదారుల సంక్షేమ జాతీయ నిధికి హెచ్‌యూఎల్‌ జమ చేయాల్సి ఉంటుంది. మిగిలిన సగాన్ని ఉత్పత్తులు విక్రయించిన రాష్ట్రాల్లోని వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాల్సి ఉంటుంది. అయితే, జాతీయ నిధికి హెచ్‌యూఎల్‌ ఇప్పటికే రూ.160.23 కోట్లను జమ చేసింది. దీంతో మిగిలిన మేర జమ చేయాలి. 

మరిన్ని వార్తలు