మ్యూచువల్ ఫండ్లకూ ‘సింగిల్ విండో’

15 Mar, 2015 01:54 IST|Sakshi
మ్యూచువల్ ఫండ్లకూ ‘సింగిల్ విండో’

మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. ఒక ఫారం నింపటంతో పాటు... ఇవ్వాల్సిన మొత్తానికి చెక్ రాసివ్వాలి. అదే సంస్థ ఆఫర్ చేస్తున్న వేరొక ఫండ్‌లో పెట్టుబడి పెడదామనుకుంటే... మరో ఫారం నింపి, మరో చెక్ ఇవ్వాలి. ఇతర సంస్థలు ఆఫర్ చేస్తున్న ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే... మళ్లీ కథ మొదటికే. అన్నిటికీ ప్రత్యేక ఫారాలు... ప్రత్యేక చెక్‌లు. వీటిన్నిటికీ విరుగుడుగా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ).

ఒక సింగిల్ విండో లావాదేవీల ప్లాట్‌ఫారాన్ని ‘మ్యూచువల్ ఫండ్ యుటిలిటీ’ ’(ఎంఎఫ్‌యూ) పేరిట ఆరంభిస్తోంది. దీనిద్వారా ఎన్ని సంస్థలకు చెందిన ఎన్ని ఫండ్లలో పెట్టుబడి పెట్టినా... ప్రత్యేక ఫారాలు, ప్రత్యేక చెక్కులు అవ సరం లేదు. అదీ కథ.
 
ఎంఎఫ్‌యూ ద్వారా జరిగే లావాదేవీలన్నీ ప్రాసెసింగ్ కోసం అసెట్ మేనేజిమెంట్ కంపెనీలు, లేక రిజిష్ట్రార్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లకు వెళ తాయి. ఈ ప్లాట్‌ఫారాన్ని యాక్సెస్ చేసుకోవటానికి మీకు ‘కామన్ అకౌంట్ నంబర్’ (క్యాన్) ఉండాలి. దీన్ని రిజిస్ట్రేషన్ ఫారం నింపి ఇవ్వటం ద్వారా ఏ ఎంఎఫ్ ఏజెన్సీ, లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గరైనా పొందవచ్చు.
 
ఈ ప్లాట్ ఫారం వల్ల వ్యక్తులు 24 గంటల్లో ఎప్పుడైనా తమ మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్లను ఆన్‌లైన్లో తెలుసుకోవచ్చు. పోర్టు ఫోలియో సమాచారమే కాక, ఇతర స్కీమ్ సంబంధ సమాచారాన్ని కూడా అప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఇంకా తమ ఇన్వెస్ట్‌మెంట్లను సమర్థంగా నిర్వహించుకోవటానికి వీలుగా అలెర్ట్‌లు, ట్రిగ్గర్‌లు, రిమైండర్ల వంటి విలువ ఆధారిత సేవలూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 25 ఏఎంసీ కంపెనీలు ఈ ఎంఎఫ్‌యూను వినియోగించుకోవటానికి  అంగీకరించాయి. ఈ నెల 4వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు