భారతి టెలికంలో సింగ్‌టెల్‌ మరింత పెట్టుబడి

6 Feb, 2018 00:38 IST|Sakshi

రూ.2,649 కోట్లతో 1.7% వాటా కొనుగోలు

దీంతో మొత్తం వాటా 48.9 శాతానికి  

న్యూఢిల్లీ: సింగపూర్‌కి చెందిన టెలికం సంస్థ సింగ్‌టెల్‌ తాజాగా భారతి టెలికంలో రూ. 2,649 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. దీంతో భారతి టెలికంలో సింగ్‌టెల్‌ వాటా 1.7 శాతం పెరిగి 48.9 శాతానికి చేరుతుంది. ఇందుకోసం షేర్ల ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ ప్రక్రియ ఈ ఏడాది మార్చిలోగా పూర్తి కానుంది. దీనికోసం షేరు ఒక్కింటి ధరను రూ.310గా నిర్ణయించారు. టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌కి భారతి టెలికం హోల్డింగ్‌ సంస్థ.

భారతి టెలికం సంస్థకి భారతి ఎయిర్‌టెల్‌లో 50.1 శాతం వాటాలున్నాయి. తాజాగా సమకూరే నిధులను రుణ భారం తగ్గించుకోవటానికి వినియోగించుకోనున్నట్లు భారతి ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. 2017 డిసెంబర్‌ 31 నాటికి కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన సంస్థ నికర రుణం రూ.91,714 కోట్లుగా ఉంది. భారతి టెలికం 2016లో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించగా.. సింగ్‌టెల్‌ కూడా ఇన్వెస్ట్‌ చేసింది. రెండేళ్ల వ్యవధిలోనే తాజాగా మరో రూ.2,649 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది.

ఇది తమ సంస్థపై సింగ్‌టెల్‌కి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని భారతి టెలికం ఎండీ దేవేన్‌ ఖన్నా పేర్కొన్నారు. మరోవైపు, భారత్‌లో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. దీర్ఘకాలిక దృష్టితో ఎయిర్‌టెల్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు సింగ్‌టెల్‌ సీఈవో ఆర్థర్‌ లాంగ్‌ తెలిపారు. స్మార్ట్‌ఫోన్స్, మొబైల్‌ డేటా వినియోగం పెరిగే క్రమంలో ప్రాంతీయంగా మార్కెట్‌ లీడర్‌గా ఎయిర్‌టెల్‌ ఆధిపత్యం కొనసాగగలదని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ షేరు 4.2 శాతం లాభపడి రూ. 439.5 వద్ద క్లోజయ్యింది.

మరిన్ని వార్తలు