నిబంధనలు సరళిస్తేనే మరిన్ని వీసాలు!

27 Feb, 2020 04:46 IST|Sakshi
ట్రంప్‌తో బీవీఆర్‌ మోహన్‌రెడ్డి

అప్పుడే అక్కడ పెట్టుబడులు పెట్టగలం

ట్రంప్‌తో భేటీలో టెక్‌ కంపెనీల వెల్లడి

నిబంధనలను సడలిస్తున్నామన్న ట్రంప్‌

‘సాక్షి’తో సైయంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలన్నా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నా నిబంధనల సరళీకరణ కీలకమని, సులభతర వ్యాపార నిబంధనలుంటేనే స్థానిక ప్రభుత్వానికి ఆదాయంతో పాటు, ఉద్యోగాలూ వస్తాయని సైయంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. భారతీయ టెక్నాలజీ కంపెనీలు యూఎస్‌లో బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన సీఈఓల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పాల్గొన్న మోహన్‌ రెడ్డి.. టెక్నాలజీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ట్రంప్‌ ముందు ప్రస్తావించారు. ఆ వివరాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.

‘‘హెచ్‌1బీ వీసాలకు సంబంధించి యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) గతేడాది నవంబర్‌లో 50:50 కంపెనీ చార్జెస్‌ నిబంధనలను తెచ్చింది. అంటే.. అమెరికాలోని భారతీయ కంపెనీల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులుంటే.. హెచ్‌1బీ వీసా కింద 4 వేల డాలర్లు, ఎల్‌1 కింద 4500 డాలర్ల రుసుము చెల్లించాలి. నిజానికి కొత్త హెచ్‌1బీ లేదా ఎల్‌1 వీసాల జారీలో ఈ నిబంధనలు ఓకే. కానీ రెన్యువల్‌ వీసాలకూ ఈ రుసుములు చెల్లించాలంటున్నారు. ఇది భారతీయ కంపెనీలకు పెనుభారమే. హెచ్‌1బీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్స్‌కే ఉద్యోగాలిద్దామంటే.. ఉద్యోగ అనుభవం అడ్డొస్తుంది. కొత్తగా వెళ్లే కంపెనీలు కూడా 50:50 కంపెనీ చార్జీల భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి ఉద్యోగులను తీసుకెళ్లే బదులు స్థానిక అమెరికన్స్‌కే ఉద్యోగాలిస్తున్నాయి. ఇక హెచ్‌1బీ వీసా వారి గ్రీన్‌కార్డ్‌ కోటా తొలగించటం వంటి లెజిస్లేటివ్‌ నిబంధనలూ ఇలాంటివే. ఈ విషయాన్ని ట్రంప్‌తో మేం ప్రస్తావించాం’’ అని మోహన్‌రెడ్డి వివరించారు.  

ట్రంప్‌ ఏం చెప్పారంటే...
వచ్చే 3–6 నెలల్లో అమెరికాలోని భారతీయ టెక్నాలజీ కంపెనీలకు సంబంధించి నియంత్రణలను సరళీకరిస్తామని ట్రంప్‌ హామీ ఇచ్చినట్లు మోహన్‌రెడ్డి వెల్లడించారు. ‘‘గతంలో ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా ట్రంప్‌ సర్కారు గత మూ డేళ్లలో నియంత్రణల్ని సడలించినట్లు  చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్‌ నిబంధనల తొలగింపును ప్రారంభించామని, వాటిని నోటిఫై చేయాల్సి ఉందని చెప్పారాయన’’ అని మోహన్‌రెడ్డి వివరించారు.
 

మరిన్ని వార్తలు