సిప్‌.. ఇప్పుడు ఆపొద్దు..!

22 Oct, 2018 00:54 IST|Sakshi

వీలుంటే కరెక్షన్లలో ఏకమొత్తంలో అదనపు పెట్టుబడి

అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడులు

ఈక్విటీ ఫండ్స్‌లో చూపించే నష్టాలు తాత్కాలికమే

వాటిని చూసి కరెక్షన్లలో అమ్మేస్తే నష్టం శాశ్వతం

బదులుగా అదనపు పెట్టుబడి పెట్టడం మంచిది

సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌/క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రతీ నెలా రూ.5,000–7,000 కోట్ల వరకు సిప్‌ మార్గంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు తరలిరావడం చూస్తున్నాం. సామాన్యుల నుంచి ఉన్నతాదాయ వర్గాల వారి వరకు అందరిలోనూ సిప్‌పై ఇటీవల అవగాహన విçస్తృతం అయింది. అయితే, తాజా మార్కెట్‌ క్రాష్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు ప్రతికూలం (మైనస్‌)గా మారాయి. దీన్ని చూసి సిప్‌ ఆపడం చేస్తే దానంత తప్పు నిర్ణయం మరొకటి ఉండదంటున్నారు నిపుణులు.

అధిక చమురు ధరలు, రూపాయి భారీ పతనం, వాణిజ్య యుద్ధాల భయం ఇవన్నీ మార్కెట్లలో నష్టాలకు కారణమైతే... ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం దరిమిలా మరిన్ని చెల్లింపుల వైఫల్యాలు ఎదురుకావచ్చన్న భయాలు ఇన్వెస్టర్లలో మొదలయ్యాయి. దీంతో మార్కెట్లు గరిష్ట స్థాయిల నుంచి 12 శాతం నష్టపోయాయి. అందరి మాదిరే ముంబైకి చెందిన రాకేశ్‌జైన్‌ అనే ఇన్వెస్టర్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏడాది క్రితమే పెట్టుబడులు ప్రారంభించాడు.

తాజా మార్కెట్‌ పతనంలో పోర్ట్‌ఫోలియో విలువ పతనాన్ని చూసి ఆందోళనకు గురయ్యాడు. ఆగస్ట్‌ చివరి వరకు అతడి పోర్ట్‌ఫోలియోలోని ఈక్విటీ ఫండ్స్‌ విలువ చక్కగా వృద్ధి చెందింది. కానీ, తీరా ఇప్పుడవి నష్టాలు చూపిస్తున్నాయి. సిప్‌ ఆపివేయాలా?, తన డబ్బులను వెనక్కి తీసేసుకోవాలా లేక పెట్టుబడి కొసాగించాలా? అన్న డైలమాలో పడ్డాడు. ఇది ఒక్క రాకేశ్‌ పరిస్థితే కాదు... చాలా మంది రిటైల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు ఎదురైన అనుభవమే. కానీ, ఫండ్స్‌లో కనిపిస్తున్న నష్టాలు తాత్కాలికమైనవి. ఈ సమయంలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటే, తాత్కాలిక నష్టాలు కాస్తా శాశ్వతంగా మారతాయని మైమనీ మంత్ర ఎండీ రాజ్‌ఖోస్లా పేర్కొన్నారు.  

మార్కెట్‌ టైమింగ్‌
ఈక్విటీల్లో ఆటుపోట్లు, అస్థిరతలన్నవి సహజంగానే ఉంటాయి. ఫలానా రోజున మార్కెట్లు ఏ వైపు వెళతాయన్నది ఊహించడం కష్టం. మార్కెట్‌ కరెక్షన్‌కు ముందు బయటకు వెళ్లిపోయి, కరెక్షన్‌ గురైన తర్వాత పెట్టుబడులతో అడుగు పెడదామని భావించడం సరైన ఆలోచన కాదు. ఐదేళ్ల క్రితం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లో సిప్‌ పెట్టుబడులు ప్రారంభించి, మార్కెట్ల తీరుతో సంబంధం లేకుండా కొనసాగి ఉంటే వార్షికంగా సగటు రాబడులు 10.5 శాతంగా ఉండేవి. అయితే, దీనికి బదులు ఇదే కాలంలో వచ్చిన ప్రతీ కరెక్షన్‌కు ముందు రోజు పెట్టుబడులు తీసేసుకుని, మళ్లీ పెట్టుబడి పెట్టి ఉంటే రాబడులు 13.8 శాతంగా ఉండేవని ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

సరైన సమయంలో ఇన్వెస్ట్‌ చేయడం అన్నది మంచి రాబడులను ఇస్తుందని ఇది తెలియజేస్తోంది. కానీ, ఈ మధ్య కాలంలో వచ్చిన పది కరెక్షన్లనూ కచ్చితంగా ముందే గుర్తించి తప్పుకోవడంతోపాటు, ఉపసంహరించుకున్న పెట్టుబడులను కచ్చితంగా మరుసటి సిప్‌ నాటికి పెట్టుబడి పెడితేనే ఈ రాబడులు వచ్చాయని గుర్తుంచుకోవాలి. అలా కచ్చితంగా అంచనా వేయగలిగితే వారు నోస్ట్రడామస్‌ అవుతారని, ఫండ్‌ మేనేజర్‌గా వారిని తాము ఎంచుకుంటామని ఓ మ్యూచువల్‌ ఫండ్స్‌ సీఈవో పేర్కొన్నారంటే... అది అసాధ్యమని భావించొచ్చు.

  వాస్తవ ప్రపంచంలో ఇన్వెస్టర్లూ ప్రతీసారీ మార్కెట్‌ కరెక్షన్‌ సమయాన్ని గుర్తించడం అన్నది సాధ్యం కాదు. పెట్టుబడికి సరైన సమయాన్ని గుర్తించినా గానీ, పతనాన్ని సరైన సమయంలో అంచనా వేయలేకపోతే రాబడులన్నీ ఆవిరైపోతాయి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే ఇన్వెస్టర్‌ సిప్‌లు కూడా ఆపేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేసే వారితో పోలిస్తే క్రమం తప్పుకుండా సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేసే వారే నిజమైన రాబడులు అందుకోగలరని అర్థం చేసుకోవాలి.

తెలివైన సాధనం...
దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్న వారిలో కొద్ది మంది మార్కెట్ల పతనం అన్నది తక్కువ ధరల వద్ద మరింత కొనుగోళ్లకు అనువైన అవకాశంగా చూస్తారు. మార్కెట్ల కరెక్షన్‌ పెట్టుబడి పరంగా ఎంత విలువైనదో వీరికి తెలుసు గనుక పడిన ప్రతీసారి అదనపు పెట్టుబడులతో ముందుకు వస్తుంటారు.

‘‘నా లక్ష్యాలు 15–20 ఏళ్ల కోసం. ఈ స్వల్పకాల కరెక్షన్లను నేను పట్టించుకోను. మార్కెట్లలో దిద్దుబాటు వచ్చినప్పుడు సిప్‌కు అదనంగా, ఏకమొత్తంలో పెట్టుబడికి అవకాశంగా చూస్తుంటాను’’ అని పుణెకు చెందిన అనుమోల్‌ పేర్కొన్నారు. అనుమోల్‌ తన చిన్నారి ఉన్నత విద్య, తన రిటైర్మెంట్‌ అవసరాల కోసం సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా మార్కెట్ల కరెక్షన్లలో సిప్‌లను ఆపివేయడం, తగ్గించి వేయడం సరైన చర్య కాదు. తెలివైన ఇన్వెస్టర్లు మార్కెట్లు పడిపోతే తదుపరి నెల సిప్‌ను ముందుగానే ఇన్వెస్ట్‌ చేస్తుంటారని అధ్యయనంలో వెల్లడైంది.


పెట్టుబడుల కాల వ్యవధి
దీర్ఘకాలంలో పెట్టుబడులపై రాబడుల విషయంలో ఈక్విటీలకు మరే ఇతర సాధనం సాటిరాదు. అదే సమయంలో స్వల్ప కాల లక్ష్యాలకు ఈక్విటీలు అనువైనవి కావు. ఎందుకంటే వీటిలో అస్థిరతలు ఎక్కువ కనుక. దీర్ఘకాలంలో ఈ అస్థిరతలను అధిగమించి రాబడులకు ఇచ్చే సామర్థ్యం ఈక్విటీలకు ఉంది. అందుకే ఎంత కాలం పాటు పెట్టుబడులు పెడతారన్నది కీలకమని ఫైనాన్షియల్‌ ప్లానర్లు పేర్కొంటారు.

ఏడాది, రెండేళ్ల లక్ష్యాల కోసం ఈక్విటీ ఆధారిత సాధనాలు రిస్క్‌తో కూడినవిగా ఆల్ఫా క్యాపిటల్‌ అసోసియేట్‌ పార్ట్‌నర్‌ దీప్తిగోయల్‌ పేర్కొన్నారు. అదే సమయంలో లక్ష్యానికి 8–10 ఏళ్ల సమయం ఉంటే స్థిరాదాయ సాధనాలను పక్కన పెట్టాలని, అవి ఈక్విటీల స్థాయిలో రాబడులను ఇవ్వలేవని చెప్పారు. కరెక్షన్లన్నవి ఈక్విటీల్లో సంపద సృష్టి అవకాశాల నుంచి ఇన్వెస్టర్లను దూరం చేయవని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు