చిన్న పరిశ్రమలకు డబ్బు కొరత రానీయం!

28 Sep, 2019 05:35 IST|Sakshi
కీలక రంగాల్లో పెట్టుబడులపై వివిధ మంత్రిత్వశాఖల కార్యదర్శులతో  సమావేశమైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌...

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

వివిధ శాఖల నుంచి 40,000 కోట్ల బకాయిలు చెల్లింపు

అక్టోబర్‌ మొదటివారంలోపు మిగిలిన బకాయిల బదలాయింపు

మంత్రిత్వ శాఖల వ్యయ ప్రణాళికలకు సూచన

తద్వారా ఆర్థిక వృద్ధికి జోష్‌

న్యూఢిల్లీ: చిన్న లఘు మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) నిధుల కొరత రాకుండా తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. వస్తు, సేవల సరఫరాలకు సంబంధించి వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి ఎంఎస్‌ఎంఈలకు రూ.40,000 కోట్ల బకాయిలను ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఆర్థికమంత్రి వెల్లడించారు. న్యాయపరమైన అంశాల్లో చిక్కుకోని మిగిలిన బకాయిలను అక్టోబర్‌ మొదటి వారం లోపు  చెల్లించేయడం జరుగుతుందని ఆర్థికమంత్రి స్పష్ట చేశారు. ఎంఎస్‌ఎంఈలకు చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.60,000 కోట్లనీ ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మూలధన పెట్టుబడులపై  21 కీలక మౌలిక పరిశ్రమ విభాగాల ఉన్నత అధికారులతో సీతారామన్‌ శుక్రవారం సమావేశమయ్యారు.

అనంతర ప్రకటనలో ముఖ్యాంశాలు..
ఆర్థికాభివృద్ధికి తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయాల పెంపుద్వారా వృద్ధికి ఊతం ఇవ్వాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఇందులో భాగంగా వచ్చే నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన సమగ్ర వ్యయ ప్రణాళికలను సమర్పించాలని వివిధ మంత్రిత్వశాఖలు, ఆయా విభాగాలను కోరడం జరిగింది.
చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా ఉండాలని ప్రభుత్వం ఎంతమాత్రం కోరుకోదు. వివిధ శాఖలకు చేసిన సేవలు, వస్తు సరఫరాలకు సంబంధించి ఎటువంటి బకాయిలు
ఉండకూడదనే ఆర్థికశాఖ భావిస్తోంది. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.
బడ్జెట్‌ అంచనాల మేర మూలధన వ్యయాలకు కేంద్రం కట్టుబడి ఉంది. అందుకు తగిన బాటలోనే కొనసాగుతోంది. బడ్జెట్‌ అంచనాలను అందుకుంటామనడంలో ఎటువంటి సందేహాలూ అక్కర్లేదు.వినియోగం పెరగాలి. రుణ వృద్ధీ జరగాలి. తద్వారా గణనీయమైన ఆర్థిక పురోగతి సాధ్యపడుతుంది.  

పెట్టుబడులకు ప్రాధాన్యత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకూ చూస్తే, మౌలిక రంగానికి చెందిన పలు మంత్రిత్వశాఖలు తమ మూలధన పెట్టుబడుల ప్రణాళికలు విషయంలో దాదాపు 50 శాతం లక్ష్యా లను సాధించాయని వ్యయ వ్యవహారాల కార్యదర్శి జీసీ ముర్మూ ఈ సందర్భంగా తెలిపారు. 2019–20 బడ్జెట్‌ ప్రకారం– కేంద్రం వ్యయ లక్ష్యాలు రూ.27.86 లక్షల కోట్లు. ఇందులో ఒక్క మూలధన వ్యయాల మొత్తం రూ.3.38 లక్షల కోట్లు. దీనితోపాటు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ (జీఏఐ)గా మంత్రిత్వ శాఖలు, విభాగాలకు మరో రూ.2.07 లక్షల కోట్లను క్యాపిటల్‌ అసెట్స్‌ సృష్టికి చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఆర్థిక పరిస్థితిపై ఎఫ్‌ఎస్‌డీసీ సబ్‌ కమిటీ సమీక్ష
ఇదిలావుండగా, ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సబ్‌ కమిటీ 23వ సమీక్ష  సమావేశం జరిపింది. వ్యవస్థలో నిధుల కొరత (లిక్విడిటీ) రానీయకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సమావేశ అంశాల్లో కీలకమైనది.  ఆర్థికమంత్రి నేతృత్వం వహిస్తుండగా, ఎఫ్‌ఎస్‌డీసీ సబ్‌ కమిటీకి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ నేతృత్వం వహిస్తారు. శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం ఫైనాన్షియల్‌ మార్కెట్ల స్థిరత్వం, ఇందుకు సంబంధించిన చర్యలపై కూడా సమీక్ష జరిపినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఎఫ్‌ఎస్‌డీసీలో వివిధ నియంత్రణా సంస్థల ప్రతినిధులు, ఆర్థికశాఖ విభాగాల చీఫ్‌లు ప్రాతినిధ్యం వహిస్తారు. శుక్రవారం నాటి సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై చర్చ జరిగింది.

 

మరిన్ని వార్తలు