-

ఎఫ్‌పీఓ బాటలో ఆరు బ్యాంకులు!

17 Apr, 2017 02:54 IST|Sakshi
ఎఫ్‌పీఓ బాటలో ఆరు బ్యాంకులు!

స్టాక్‌ మార్కెట్ల జోరు నేపథ్యం...
ఆర్థిక శాఖ అంచనా...
జాబితాలో ఎస్‌బీఐ, బీఓబీ, పీఎన్‌బీ  


న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లు జోరుమీదుండటంతో కంపెనీల నిధుల సమీకరణ వేగం పుంజుకుంటోంది. ఇదే మంచి తరుణమంటూ లిస్టింగ్‌కు వస్తున్న అనేక ఐపీఓలు హిట్‌ కొడుతున్నాయి కూడా. ఇప్పుడు బ్యాంకులు కూడా తమ పెట్టుబడి అవసరాల కోసం మార్కెట్‌ తలుపుతట్టేందుకు రెడీ అవుతున్నాయి. కనీసం ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లు త్వరలో ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) రూట్‌లో నిధులను సమీకరించే అవకాశం ఉందనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల అంచనా. దీనివల్ల మూలధన నిధులను అందించే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్థిఖ శాఖ భావిస్తోంది.

 ‘నిధుల కోసం బ్యాంకులు క్యాపిటల్‌ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం ఆరు పీఎస్‌బీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయని అంచనా వేస్తున్నాం. అయితే, ఎప్పుడు, ఎంత మొత్తంలో నిధులను సమీకరించాలనేది ఆయా బ్యాంకులే నిర్ణయించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) నిధుల సమీకరణకు సిద్ధంగా ఉన్నవాటిలో తొలివరుసలో ఉన్నాయి’ అని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

రూ.1.1 లక్షల కోట్లు లక్ష్యం...
పీఎస్‌బీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రధనుష్‌ పథకం ప్రకారం.. ఎఫ్‌పీఓ సహా ఇతరత్రా పద్దతుల్లో మార్కెట్ల నుంచి పీఎస్‌బీలు 2019 మార్చిలోగా రూ.1.1 లక్షల కోట్లను సమీకరించుకోవాల్సి ఉంటుంది. మార్చి, 2019 నుంచి బాసెల్‌–3 నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. కాగా, ఇంద్రధనుష్‌లో భాగంగా కేంద్రం పీఎస్‌బీలకు రూ.70,000 కోట్ల మూలధనాన్ని అందించనుంది. ఇప్పటికే రూ.50,000 కోట్లను గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇచ్చింది.

 మిగతా మొత్తాన్ని 2018–19 చివరిలోపు ఇవ్వనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీలకు రూ.10,000 కోట్లు ఇవ్వనున్నామని.. అవసరమైతే మరింత మొత్తాన్ని సమకూరుస్తామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. కాగా, మార్కెట్‌ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.15,000 కోట్లను సమీకరించేందుకు ఇప్పటికే ఎస్‌బీఐ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిధుల సమీకరణ ఎఫ్‌పీఓ, క్యాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ), రైట్‌ ఇష్యూ,  గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్, అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌ వీటిలో ఏదైనా మార్గంలో లేదా రెండుమూడు మార్గాల్లో కలిపి ఉండొచ్చని ఎస్‌బీఐ పేర్కొంది.

మరిన్ని వార్తలు