ఆరు బ్యాంకులకు రూ. 7.5 వేల కోట్లు

4 Jan, 2018 00:43 IST|Sakshi

ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే ప్రయత్నాల్లో భాగంగా.. బలహీనంగా ఉన్న ఆరు పీఎస్‌బీలకు రూ. 7,577 కోట్లు అందించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, దేనా బ్యాంక్‌ వీటిలో ఉన్నాయి. మొండిబాకీల భారం అధికంగా ఉన్న ఈ బ్యాంకులన్నిటా ఆర్‌బీఐ సత్వర పరిష్కార చర్యలను అమలు చేస్తోంది.షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా ఇవి అదనపు మూలధనాన్ని సమకూర్చుకోనున్నాయి. షేర్ల జారీ కోసం తమ బోర్డులు ఆమోదముద్ర వేసినట్లు యూకో బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించాయి.

నియంత్రణ సంస్థలు, షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే నిధులు లభిస్తాయి.  ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) తగినంత స్థాయిలో క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో (సీఏఆర్‌) కలిగి ఉండేలా చూసేందుకు కేంద్రం.. ఇంద్రధనుస్సు ప్రణాళిక కింద బ్యాంకులకు నాలుగేళ్ల వ్యవధిలో (2019 మార్చి దాకా) రూ. 70,000 కోట్ల మేర అదనపు మూలధనం సమకూరుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రణాళిక కిందే తాజా ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఇందులో యూకో బ్యాంకుకు రూ. 1,375 కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌కు రూ. 323 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి రూ. 2,257 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్‌కు రూ. 2,729 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకి రూ. 650 కోట్లు, దేనా బ్యాంక్‌కు రూ. 243 కోట్లు లభించనున్నాయి.   

మరిన్ని వార్తలు