కొత్త హ్యుందాయ్ ఎలంత్ర

24 Aug, 2016 00:59 IST|Sakshi
కొత్త హ్యుందాయ్ ఎలంత్ర

ధరల శ్రేణి రూ.12.99- రూ.19.19 లక్షలు
ప్రారంభ ధరలు డిసెంబర్ వరకే

హ్యుందాయ్ కంపెనీ ఎలంత్ర మోడల్‌లో కొత్త వేరియంట్లను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఆరో తరం ఎలంత్ర సెడాన్ ప్రారంభ ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ.19.19 లక్షల రేంజ్‌లో ఉంటాయని హ్యుందాయ్ ఇండియా పేర్కొంది. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ.17.99 లక్షలు, డీజిల్ వేరియంట్ ధరలు రూ.14.79 లక్షల నుంచి రూ.19.19 లక్షల రేంజ్‌లో(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించినట్లు కంపెనీ ఎండీ, సీఈఓ వైకే కూ చెప్పారు. ఈ ప్రారంభ ధరలు ఈ ఏడాది డిసెంబర్ వరకే అందుబాటులో ఉంటాయని వివరించారు.  ఈ సెగ్మెంట్లో  టయోట కొరొల్లా ఆల్టిస్, ఫోక్స్‌వ్యాగన్ జెటా, స్కోడా ఆక్టేవియా, జనరల్ మోటార్స్ క్రూజ్‌లు అమ్ముడవుతున్నాయి.

వాటా పెరుగుదలపై ఆశాభావం..
హై డెన్సిటి డిస్‌చార్జ్ హెడ్‌ల్యాంప్స్, ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్, గ్లాస్ యాంటెన్నా, వాయిస్ రికగ్నిషన్ తదితర కొత్త ఫీచర్లు ఈ కొత్త వేరియంట్లలలో ఉన్నాయని కూ పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్‌లు 14.59-14.63 కిమీ. డీజిల్ వేరియంట్‌లు 18.23-22.45 కిమీ. మైలేజీని ఇస్తాయని వివరించారు. స్పోర్ట్స్‌యుటిలిటి వెహికల్(ఎస్‌యూవీ) మార్కెట్లో ఇప్పటికే తగినంత వాటా సాధించామని, ఈ కొత్త ఎలంత్ర వేరియంట్‌తో తమ మార్కెట్ వాటా మరింతగా పెరగగలదన్న ఆశాభావాన్ని కూ వ్యక్తం చేశారు.

1990లో ఎలంత్ర కారును ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం ప్రారంభించామని, ఇప్పటిదాకా 1.15 కోట్ల కార్లను అమ్మామని పేర్కొన్నారు. ఈ కొత్త ఎలంత్ర కారుతో ఎగ్జిక్యూటివ్ సెడాన్ సెగ్మెంట్‌లో అగ్రస్థానం సాధించగలమన్న అంచనాలున్నాయని చెప్పారు. ఈ సెగ్మెంట్లో ఆరు బ్రాండ్ల కార్లు నెలకు వెయ్యి అమ్ముడవుతున్నాయని, వీటిల్లో తమ వాటా 250 యూనిట్లని వివరించారు. ఈ కొత్త ఎలంత్ర కారణంగా ఈ సంఖ్య 350కు పెరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్/నవంబర్‌లో ప్రీమియమ్ ఎస్‌యూవీ టూసన్‌ను అందించనున్నామని కంపెనీ ఎండీ, సీఈఓ వైకే కూ చెప్పారు.

ప్రతి ఏడాది రెండు కొత్త మోడళ్లు..
భారత్‌లో అగ్ర స్థానం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఏడాది రెండు తాజా మోడళ్లను అందుబాటులోకి తెస్తామని  కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో తమ మార్కెట్ వాటా 17 శాతమని పేర్కొన్నారు. తమ అంతర్జాతీయ అమ్మకాల్లో భారత్ వాటా 13 శాతమని వివరించారు. ఏడవ వేతన సంఘం సిఫారసుల వల్ల అమ్మకాలు పెరగవచ్చని అంచనా.

మరిన్ని వార్తలు