యాపిల్ కు ‘నెట్ వర్క్’ కష్టాలు!

28 Apr, 2016 00:58 IST|Sakshi
యాపిల్ కు ‘నెట్ వర్క్’ కష్టాలు!

స్లో నెట్‌వర్క్, సరైన రిటైలింగ్ వ్యవస్థ లేకపోవడమే భారత్‌లో మాకు అడ్డంకి
కంపెనీ చీఫ్ టిమ్ కుక్ వ్యాఖ్య
13 ఏళ్లలో తొలిసారి ఆదాయాల్లో క్షీణత

 న్యూయార్క్: భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ టెలికం నెట్ వర్క్‌లో తగినంత వేగం లేకపోవడం, రిటైల్ షోరూమ్‌ల స్వరూపం అస్తవ్యస్తంగా ఉండటం వంటివి తమకు అడ్డంకిగా మారాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. తమ కంపెనీ భారత్ మార్కెట్లో జోరును ప్రదర్శించలేకపోవడానికి ఇవే ప్రధాన కారణాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా పరిశ్రమ విశ్లేషకులతో కన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.

గడిచిన 13 ఏళ్లలో యాపిల్ ఆదాయం తొలిసారి క్షీణించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్. అయితే, స్లో నెట్‌వర్క్, కొనుగోలు శక్తి వంటి అంశాలతో ఇక్కడ చౌక స్మార్ట్‌ఫోన్‌ల హవానే కొనసాగుతోంది. అందుకే మా స్థాయికి తగ్గట్లుగా తగినంత మార్కెట్ వాటాను సంపాదించలేకపోతున్నాం. అయితే, పదేళ్లక్రితం చైనాలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే భారత్‌లోనూ అద్భుతమైన అవకాశాలు ఉన్నట్లే లెక్క’ అని కుక్ పేర్కొన్నారు.

 కాగా, అమెరికా తర్వాత యాపిల్‌కు రెండో అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో మార్చి క్వార్టర్ ఐఫోన్‌ల అమ్మకాలు 11 శాతం పడిపోగా, భారత్‌లో మాత్రం 56 శాతం ఎగబాకడం గమనార్హం. బారత్‌లో ఇంకా 4జీ(ఎల్‌టీఈ) నెట్‌వర్క్ ఈ ఏడాదే పూర్తిస్థాయిలో ఆరంభమైందని.. రానున్న కాలంలో ఈ మరిన్ని కంపెనీలు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచితే తమకు మంచి అవకాశాలు లభిస్తాయని కుక్ చెప్పారు. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే యాపిల్ ఐఫోన్‌ల శక్తిసామర్థ్యాలు 4జీ వంటి వేగవంతమైన నెట్‌వర్క్‌లతోనే వినియోగదారులకు తెలిసొస్తాయన్నారు.

షాకింగ్ ఫలితాలు...
యాపిల్ మంగళవారం ప్రకటించిన 2016, జనవరి-మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు కంపెనీ ఇన్వెస్టర్లకు షాకిచ్చాయి. గత పదమూడేళ్లలో తొలిసారిగా ఆదాయం క్షీణించింది. 2015 ఇదే త్రైమాసికంలో ఆదాయం 58 బిలియన్ డాలర్లతో పోలిస్తే 13% దిగజారి 50.6 డాలర్లకు పడిపోయింది. నికర లాభం 22% క్షీణతతో 13.6 బిలియన్ డాలర్ల నుంచి 10.6 బిలియన్ డాలర్లకు దిగజారింది. ఐఫోన్‌ల విక్రయాలు కూడా తొలిసారిగా(క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే) పడ్డాయి. గత మార్చి క్వార్టర్‌లో 6.2 కోట్ల ఐఫోన్లు అమ్ముడవగా.. ఈ మార్చి త్రైమాసికంలో 5.2 కోట్ల ఫోన్లను కంపెనీ విక్రయించింది. కాగా, ఫలితాలపై కుక్ స్పందిస్తూ... ఇదేమంత పెద్ద ప్రతికూలాంశం కాదని.. యాపిల్ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు