ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టకాలం..

15 Aug, 2019 05:00 IST|Sakshi

జూన్‌ నెలలో మూడేళ్ల కనిష్టానికి రుణ వృద్ధి

ఆటో, రియల్టీ తదితర రంగాల్లో డిమాండ్‌ తగ్గడం కారణం

కష్టతరంగా నిధుల సమీకరణ

సదరు సంస్థల ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం

న్యూఢిల్లీ: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు చాలా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. ఇటు రుణాలకు డిమాండ్‌ తగ్గి అటు నిధుల సమీకరణ కష్టతరంగా మారడంతో జూన్‌ త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీల రుణ మంజూరు వృద్ధి రేటు గణనీయంగా క్షీణించి ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆటో మొబైల్, రియల్‌ ఎస్టేట్, నాన్‌–రిటైల్‌ రంగాల్లో డిమాండ్‌ మందగించడం కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం చూపించిందన్న అంచనాలు ఉన్నాయి.   

జూన్‌ త్రైమాసికంలో మొత్తం మీద పరిశ్రమ రుణ వృద్ధి 15 శాతమే ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది. 2017 మార్చి తర్వాత ఇది కనిష్ట స్థాయి.  ‘అంతటా మందగమనం కనిపిస్తోంది. నిధులపరమైన కొరతే కాకుండా రుణాలు తీసుకునే విభాగాల్లో కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్, రియల్టీ రంగాల్లో మందగమనం ఎన్‌బీఎఫ్‌సీ రుణ వృద్ధిపై ప్రతికూలంగా ఉండొచ్చు‘ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థలో ఎన్‌బీఎఫ్‌సీ విశ్లేషకుడు అల్పేష్‌ మెహతా చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి వాహన దిగ్గజాల అమ్మకాలు మందగించాయి. ఈ ఏడాది మేలో మారుతీ సుజుకీ ఉత్పత్తిని సుమారు 18% తగ్గించుకుంది.  డిమాండ్‌ బలహీనంగా ఉండటంతో ఉత్పత్తిలో కోత విధించుకోవడం వరుసగా ఇది 4వ నెల.  

కొన్నే మెరుగ్గా..
అయితే హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్స్‌ వంటి బలమైన మాతృసంస్థలున్న ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గానే ఉండొచ్చని అంచనా.  మిగతా ఎన్‌బీఎఫ్‌సీలతో పోలిస్తే వీటికి బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ మొదలైన వాటి నుంచి పుష్కలంగా నిధుల లభ్యత ఉండటమే ఇందుకు కారణమని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఏఎస్‌ ఫైనాన్షియల్, పీఎన్‌బీ హౌసింగ్‌ సంస్థల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని, మరోవైపు ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ముత్తూట్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది.

తొలి త్రైమాసికం అంతంత మాత్రమే..
సాధారణంగా తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్‌ ఫైనాన్స్‌ సంస్థల పనితీరు అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక ఎన్నికలు ఆపై మందగమనం తదితర కారణాల వల్ల ఆ సంస్థల రుణాల పోర్ట్‌ఫోలియోల విశేషాలను త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ‘ఆటో, హౌసింగ్‌ లోన్స్‌  సంస్థలకు  తొలి త్రైమాసికం కాస్త బలహీనంగా ఉంటుంది. ఈ ఏడాది   ఎన్నికల ప్రభావం తోడైంది. రిటైల్‌ రుణాల్లో మందగమనం, డెవలపర్లు సమస్యల్లో ఉండటం వంటి అంశాలు హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు‘ అని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది.    
ఇక, సాధారణంగా గృహ రుణాల మెచ్యూరిటీ గడువు అనేక సంవత్సరాల పాటు, కొన్ని సార్లు కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు ఆస్తులు, అప్పుల మధ్య సమన్వయం పాటించడం కష్టతరంగా మారుతోంది. ఈ సంస్థలు స్వల్పకాలిక రుణాలు తీసుకొచ్చుకుని.. దీర్ఘకాలిక ప్రాతిపదికన రిటైల్‌ రుణాలు ఇస్తున్నాయి. అయితే, ఇన్‌ఫ్రా రుణాల దిగ్గజం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గతేడాది సెప్టెంబర్‌లో డిఫాల్ట్‌ అయినప్పట్నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులు దొరకడమే గగనంగా మారింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ విషయమే తీసుకుంటే భారీ ప్రొవిజనింగ్‌ చేయాల్సి రావడం, రుణ వితరణ తగ్గడంతో మార్చి త్రైమాసికంలో రూ. 2,223 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది.

ఎన్‌బీఎఫ్‌సీలకు మరిన్ని రుణాలతో బ్యాంకులకు సమస్యలు
ఆర్‌బీఐ ప్రతిపాదనలపై ఫిచ్‌ హెచ్చరిక
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), రిటైల్‌ రుణ గ్రహీతలకు బ్యాంకులు మరిన్ని రుణాలు పంపిణీ చేసే దిశగా ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న పలు చర్యలు అంతిమంగా బ్యాంకింగ్‌ రంగానికి సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ హెచ్చరించింది. గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బారిన పడిన తర్వాత నుంచి ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో... ఈ రంగానికి ఉపశమనం కల్పించే పలు నిర్ణయాలను ఆర్‌బీఐ ఎంపీసీ ఈ నెల మొదటి వారంలో ప్రకటించింది. ఇందులో బ్యాంకుల టైర్‌1 మూలధనంలో 15 శాతం వరకు ఒక ఎన్‌బీఎఫ్‌సీ సంస్థకు నిధులు సమకూర్చవచ్చన్న పరిమితిని 20 శాతానికి పెంచింది.

వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలకు ఎన్‌బీఎఫ్‌సీ ఇచ్చే రుణాలను ప్రాధాన్యం రంగ రుణాలుగా పరిగణించడం, కన్జ్యూమర్‌ రుణాల రిస్క్‌ వెయిటేజీని 125 శాతం నుంచి 100 శాతానికి తగ్గించడం జరిగింది. మందగమన సంకేతాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి రుణ వితరణ పెరిగేలా చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఫిచ్‌ అభివర్ణించింది. అయితే, ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్‌ రిస్కును అంగీకరించాల్సి వస్తుందని ఫిచ్‌ తెలిపింది. అంతర్జాతీయంగా ఎన్‌బీఎఫ్‌సీలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానతకు చెక్‌ పెట్టాలన్న ప్రయత్నాలకు, భారత్‌లో తాజా చర్యలు వైరుధ్యంగా ఉన్నట్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలు బ్యాంకులకు కూడా పాకుతాయని హెచ్చరించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా