మళ్లీ పడకేసిన పరిశ్రమలు..!

13 Sep, 2016 06:53 IST|Sakshi
మళ్లీ పడకేసిన పరిశ్రమలు..!

జూలైలో పారిశ్రామికోత్పత్తి మైనస్ 2.4 శాతం క్షీణత...
8 నెలల కనిష్ట స్థాయికి తిరోగమనం
ఐదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
ఆగస్టులో 5.05 శాతం రేటు కోత తప్పదని పరిశ్రమ విజ్ఞప్తి
తాము ఇదే భావిస్తున్నామని కేంద్రం సంకేతం

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో తదుపరి రేటు కోత అవకాశాలకు తాజా దేశ స్థూల ఆర్థిక గణాంకాలు అద్దం పట్టాయి. వినియోగ ధరల (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో ఐదు నెలల కనిష్ట స్థాయి 5.05 శాతానికి పడిపోయింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు కేంద్రం నిర్దేశిత లక్ష్యం 4 ప్లస్ 2 శాతం స్థాయి కన్నా దిగువ కావడం గమనార్హం. జూలైలో ఈ రేటు ఈ స్థాయిని దాటి (6.07 శాతం) ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. ఇక జూలై పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) తీవ్ర నిరాశ కలిగించింది. అసలు వృద్ధి లేకపోగా క్షీణతను నమోదుచేసుకుంది. ఎనిమిది నెలల కనిష్ట స్థాయిలో -2.4 శాతంగా నమోదయ్యింది. తయారీ, క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి పేలవ పనితీరు దీనికి కారణం.గత ఏడాది జూలైలో 4.3 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది.  

పారిశ్రామిక ఉత్పత్తి తీరు...
తయారీ: మొత్తం ఐఐపీ సూచీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో ఉత్పత్తి అసలు వృద్ధిలేకపోగా -3.4 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి 4.8 శాతం. ఈ విభాగంలో 22  పారిశ్రామిక గ్రూపులకు 12 ప్రతికూలతలో ముగిశాయి.

క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ విభాగంలో భారీగా 29.6% క్షీణత (మైనస్) నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో ఈ రేటు 10.1 శాతం.

విద్యుత్: వృద్ధి రేటు 3.5 శాతం నుంచి 1.6 శాతానికి దిగింది.

మైనింగ్: ఈ రంగంలో వృద్ధి కూడా 1.3% నుంచి 0.8%కి తగ్గింది.

వినియోగం: మొత్తంగా వినియోగ ఉత్పత్తుల ఉత్పత్తి వృద్ధి 1.1 శాతం నుంచి 1.3 శాతానికి పెరిగింది. ఇందులో భాగమైన  కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి  వృద్ధి 10.5 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది. కన్జూమర్ నాన్-డ్యూరబుల్స్ ఉత్పత్తి -1.7 శాతం క్షీణించింది. ఈ క్షీణత గత ఏడాది ఇదే కాలంలో -4.4 శాతంగా ఉంది.

నాలుగు నెలల కాలంలో...: ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచీ గడచిన నాలుగు నెలల్లో (ఏప్రిల్-జూలై) పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా -0.2 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 3.5 శాతం.

అక్టోబర్4పై దృష్టి...
అక్టోబర్ 4వ తేదీన ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో వెల్లడైన తాజా ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు తదుపరి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం) కోతకు దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి పురోగతికి ఇది తప్పదని పారిశ్రామిక వర్గాలూ డిమాండ్ చేస్తున్నాయి. కాగా తాజా గణాంకాలను పరిశీలనలోకి తీసుకుని ఆర్‌బీఐ అక్టోబర్ 4న రెపో రేటు కోత విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు.

రిటైల్ ధరల ఊరట..
వినియోగ ధరల (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో ఐదు నెలల కనిష్ట స్థాయి 5.05 శాతానికి పడిపోయింది. జూలైలో ఈ రేటు 6.07 శాతం. దాదాపు 100 బేసిస్ పాయింట్లు పడిపోవడానికి ఆహార ఉత్పత్తుల ధరల స్పీడ్ తగ్గడం ప్రధాన కారణ మయ్యింది. కీలక విభాగాలను చూస్తే...

ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 5.83 శాతంగా నమోదయ్యింది.

పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తుల ధరలు 6.86 శాతం ఎగశాయి.

క్లాథింగ్ అండ్ ఫుట్‌వేర్ ధరలు 5.21 శాతం ఎగిశాయి.

హౌసింగ్ ధరలు 5.29 శాతం పెరిగాయి.

ఇంధనం, లైట్‌లో ధరలు 2.49 శాతం ఎగిశాయి.
ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలను చూస్తే..
వార్షికంగా ఆగస్టులో ఐదు శాతంకన్నా ధరలు తగ్గిన ఉత్పత్తుల్లో కూరగాయలు (1.02 శాతం), పండ్లు (4.46 శాతం), నూనె, వెన్న (4.94 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (4.36 శాతం), ఆల్కహాలేతర పానీయాలు(4.24%) ఉన్నాయి. ఇక పప్పు ధాన్యాల ధరలు ఏకంగా 22% ఎగశాయి. చక్కెర, సంబంధిత పదార్థాల ఉత్పత్తులు 25% ఎగశాయి. గుడ్ల ధరలు 10 శాతం పెరిగాయి.

మరిన్ని వార్తలు