చిన్న వ్యాపారాల నుంచి రూ. 2.32 లక్షల కోట్ల డిఫాల్ట్‌ల ముప్పు: సిబిల్‌

23 Apr, 2020 06:07 IST|Sakshi

ముంబై: కోవిడ్‌–19 ప్రభావంతో చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాల్లో దాదాపు రూ.2.32 లక్షల కోట్లు డిఫాల్ట్‌ అయ్యే తీవ్ర పరిస్థితి నెలకొందని సిబిల్‌ పేర్కొంది. ప్రత్యేకించి రూ.10 లక్షలలోపు రుణం ఉన్న లఘు పరిశ్రమలు తీవ్రంగా కరోనా ప్రభావానికి గురవుతాయని బుధవారంనాడు క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ పేర్కొంది. రూ.10 లక్షల లోపు రుణం ఉన్న చిన్న సంస్థల మొత్తం రుణ పరిమాణం దాదాపు రూ.93,000 కోట్లయితే, ఇందులో రూ.13,600 కోట్లు మొండిబకాయిల ఖాతాలోకి వెళ్లొచ్చని అంచనావేసింది.
 
చిన్న పరిశ్రమలను ఆదుకోవాలి.. ఐబీఏ: కాగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ఆదుకోవాలని కేంద్రం,  ఆర్‌బీఐలకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ రంగానికి సంబంధించి రుణ బకాయిల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం, క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్, వన్‌టైమ్‌ లోన్‌ రిస్ట్రక్చరింగ్‌ వంటి కొన్ని కీలక సిఫారసులు ఐబీఏ జాబితాలో ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈలు, బ్యాంకింగ్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలుసహా పలు పారిశ్రామిక విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఐబీఏ కీలక సిఫారసులు చేసింది.

మరిన్ని వార్తలు