చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోత 

1 Apr, 2020 17:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రా (కెవీపీ) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి) లాంటి  ఏడు ప్రజాదరణ పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. కరోనా  వైరస్  ప్రభావంతో ఈ పథకాలపై చెల్లించే వడ్డీరేను 70 నుంచి 140 బేసిస్ పాయింట్లు మేర  కోత పెట్టింది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మధ్య, పేద తరగతి ప్రజలు కష్టపడి పొదుపు చేసుకునే లక్షల మంది ప్రభావితం కానున్నారు. ఈ సవరించిన రేట్లు నేటి (ఏప్రిల్ 1 ) నుంచి అమల్లోకి వచ్చాయి.  ఏప్రిల్ 2016 నుండి, అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ దిగుబడులతో అనుసంధానించిన నేపథ్యంలో ప్రతి త్రైమాసికంలో వడ్డీరేట్ల సమీక్ష వుంటుంది.

పీపీఎఫ్  పథకంపై  ప్రస్తుతం 7.9 శాతం వర్తిస్తుండగా, తాజా నిర్ణయం ప్రకారం ఇది 7.1 శాతానికి దిగి వచ్చింది.  ఐదేళ్ల జాతీయ పొదుపు ధృవీకరణ  (ఎన్‌ఎస్‌సి) పత్రంపై  7.9 శాతానికి బదులు ఇపుడు  6.8 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే కేవీపీ 6.9 శాతంగా వుంది. ఇప్పటివరకు ఇది  7.6 శాతం. సుకన్య సమృద్ది ఖాతా లకు 8.4 శాతానికి బదులుగా 7.4 శాతంగా వుంటుంది.  ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 7.6 శాతంగా వుంది. అంతకు ముందు ఇది8.శాతం. ఐదేళ్ల నెలవారీ ఆదాయ పథకం 6.6శాతం. ఇప్పటివరకు ఇది 7.6 శాతం. అలాగే 1-5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లుపై వడ్డీ 5.5-6.7శాతం. ఐదేళ్ల రికరింగ్  డిపాజిట్లపై 5.8 శాతం వడ్డీ వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ముందస్తు పాలసీ సమీక్షలొ రెపో రేటు కోతకు మొగ్గు  చూపిన అనంతరం, తాజాగా చిన్న పొదుపు పథకాల వడ్డీరేటుపై కోత పడింది.

అయితే ఊహించిన దానికంటే  ఈ తగ్గింపు ఎక్కువగా వుందని డిపాజిట్ రేట్లను మరింత తగ్గించడానికి ప్రభుత్వం ఇలా చేసి ఉండవచ్చని  ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ పథకాల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రధానంగా ఆధారపడే వారు ఇప్పుడు వారి పోర్ట్‌ఫోలియోను తిరిగి సందర్శించాల్సి ఉంటుందని వైజెన్‌వెస్ట్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమంత్ రుస్తాగి తెలిపారు. తాజా నిర్ణయంతో సాంప్రదాయ పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.నేరుగా ఈక్విటీలో పెట్టుబడులు పెట్టాలని సూచించలేనప్పటికీ, మ్యూచువల్ ఫండ్లలో హైబ్రిడ్ ఫండ్స్ ను పరిశీలించాలని సూచించారు.  కాగా కోవిడ్ -19 వ్యాప్తి, ఆర్థికవ్యవస్థపై ప్రభావం నేపథ్యంలో ఆర్బీఐ గత వారం రెపో రేటును  75 బీపీఎస్  పాయింట్లను తగ్గించిన  సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా