భారత్‌కు షియోమి స్మార్ట్ టీవీలు త్వరలో...

10 Jul, 2015 23:38 IST|Sakshi
భారత్‌కు షియోమి స్మార్ట్ టీవీలు త్వరలో...

- ఇతర ఉపకరణాలు కూడా దశలవారీగా ప్రవేశపెడతాం
- షియోమి ఇండియా హెడ్ మను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
టెక్నాలజీ కంపెనీ షియోమి మొబైల్స్‌తోపాటు ఇతర ఉపకరణాలను భారత్‌కు తీసుకొస్తోంది. స్మార్ట్ టీవీ, హెడ్‌ఫోన్స్, 1 టీబీ నుంచి 6 టీబీ బిల్ట్ ఇన్ స్టోరేజ్‌తో కూడిన వైఫై రౌటర్స్, కెమెరాలను ఇతర దేశాల్లో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఎంఐ బ్యాండ్ ఫిట్‌నెస్ ట్రాకర్‌తోపాటు పవర్ బ్యాంక్స్, ఎల్‌ఈడీ లైట్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. ఈ ఏడాదే ఎంఐ బాక్స్‌ను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ఇది స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్. సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మలుస్తుంది.

ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను ప్రస్తుతం పరీక్షిస్తోంది. స్మార్ట్ టీవీ ఈ ఏడాది చివరికి లేదా 2016 ప్రారంభంలో తీసుకొస్తామని షియోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇక 5.7 అంగుళాల ఎంఐ నోట్ కొద్ది రోజుల్లో విడుదల చేస్తామన్నారు. ఇతర వ్యయాలను గణనీయంగా తగ్గించడంతోపాటు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న కారణంగా ఉత్పత్తులను అతి తక్కువ ధరలో అందించే వీలైందన్నారు.
 
తయారీ ఈ ఏడాదే..: బెంగళూరులో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని షియోమి ఏర్పాటు చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఈ కేంద్రంలో నూతన మొబైల్స్‌కు డిజైన్ చేస్తామని మను కుమార్ తెలిపారు. తయారీ ప్లాంటు ఏర్పాటు ఈ ఏడాదే కార్యరూపంలోకి వస్తుందన్నారు. 2014 జూలై చివర్లో భారత్‌లో అడుగు పెట్టామని, తొలి నాలుగు నెలల్లో 10 లక్షలకుపైగా ఫోన్లను విక్రయించామని పేర్కొన్నారు.

ఐడీసీ తాజా గణాంకాల ప్రకారం షియోమి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 4% వాటాతో 5వ స్థానంలో ఉందన్నారు. షియోమికి ఫోన్లను సరఫరా చేస్తున్న రెండు ప్రధాన కంపెనీల్లో ఫాక్స్‌కాన్ ఒకటి. శ్రీసిటీ ప్లాంటులో షియోమికి రోజుకు 10,000 ఫోన్లను ఫాక్స్‌కాన్ తయారు చేయనుందని వస్తున్న వార్తలను ఆయన ధ్రువీకరించలేదు.

మరిన్ని వార్తలు