పండుగ సీజన్‌కు స్మార్ట్‌ఫోన్ల జోష్‌

8 Aug, 2017 00:59 IST|Sakshi
పండుగ సీజన్‌కు స్మార్ట్‌ఫోన్ల జోష్‌

మెరుగుపడనున్న సెంటిమెంటు
♦  జేపీ మోర్గాన్‌ నివేదికలో వెల్లడి


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల విపణి మూడో త్రైమాసికంలో మంచి జోష్‌మీద ఉంటుందని జేపీ మోర్గాన్‌ తన ‘ఇండియా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌’ నివేదికలో వెల్లడించింది. మెరుగైన సెంటిమెంటుతోపాటు పండుగల సీజన్‌ కోసం విక్రేతల వద్ద సరుకు నిల్వలు పెరగడం ఇందుకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం.. జీఎస్‌టీ అమలుతీరుపై స్పష్టత లేక సరుకు నిల్వ చేసుకోవడాన్ని విక్రేతలు వాయిదా వేయడంతో ఏప్రిల్‌–జూన్‌లో డిమాండ్‌ సాధారణంగా ఉంది. అలాగే ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మళ్లే ప్రక్రియ నెమ్మదించడం కూడా స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌ తగ్గడానికి కారణమైంది. జూలై ప్రారంభం నుంచే సెంటిమెంటు మెరుగుపడింది. జూలై–సెప్టెంబరులో విక్రయాలు గణనీయంగా ఉంటాయి. ఈ కాలంలో అమ్మకాలు క్రితం త్రైమాసికంతో పోలిస్తే 25–30 శాతం, 2016 జూలై–సెప్టెంబరుతో పోలిస్తే 7 శాతం వృద్ధి నమోదు చేస్తాయి. నాల్గవ త్రైమాసికం ప్రారంభం వరకు అమ్మకాల జోష్‌ ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ల వాటా 45 శాతం..
ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో అమ్ముడైన మొత్తం మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ల వాటా 45 శాతం ఉంటుందని జేపీ మోర్గాన్‌ నివేదిక వెల్లడించింది. ‘స్మార్ట్‌ఫోన్ల విభాగం జూలై–సెప్టెంబరులో ఇదే స్థాయిలో కొనసాగుతుంది. ఈ త్రైమాసికంలో అందుబాటులోకి రానున్న రూ.1,500 విలువగల జియో ఫీచర్‌ఫోన్‌ ఇందుకు కారణం. ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మళ్లే ప్రక్రియ మందగించే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్‌ ప్రభావం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై తాత్కాలికమే.‘ అని వివరించింది.

మరిన్ని వార్తలు