చౌక స్మార్ట్‌ఫోన్‌లకు భలే గిరాకీ

5 Jun, 2014 01:20 IST|Sakshi
చౌక స్మార్ట్‌ఫోన్‌లకు భలే గిరాకీ

న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.  భారీ సంఖ్యలో భారతీయులు ఫీచర్ల ఫోన్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవుతుండడమే దీనికి కారణమని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం ఈ ఏడాది భారత్‌లో 8 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లు అమ్ము డవుతాయి.  భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని విశేషాలు...,
   పలు కంపెనీలు చౌక ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లనందిస్తున్నాయి. దీంతో ఫీచర్ ఫోన్లకు, స్మార్ట్‌ఫోన్లకు మధ్య ధర వ్యత్యాసాలు తగ్గుతుండటంతో పలువురు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు.

   స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రానున్న ఐదేళ్లలో 40 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయి.

   ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఎక్కువగా జరిగాయి.

   ఈ కాలానికి ఈ విక్రయాలు 186 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. చైనాలో ఈ వృద్ధి 31 శాతంగానే ఉంది.

  వార్షిక ప్రాతిపదికన చూస్తే  ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి మొత్తం మొబైల్ ఫోన్‌ల విక్రయాలు 1 శాతం పెరగ్గా, అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే 10 శాతం క్షీణించాయి.

   గత ఏడాది చివరి మూడు నెలల కాలం అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో మొబైల్ ఫోన్‌ల విక్రయాలు 18 శాతం తగ్గాయి. స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు మాత్రం 61.4 లక్షల నుంచి 17 శాతం వృద్ధితో 1.75 కోట్లకు పెరిగాయి. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లకు ప్రాధాన్యత ఇస్తుండడం, ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతుండడం తదితర కారణాల వల్ల స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు పెరుగుతున్నాయి.

   భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విస్తరణ 10 శాతంలోపే ఉంది. తక్కువ ధరలకే  స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతుండడం, అమ్మకాల పెంపుపై పెద్ద పెద్ద కంపెనీలు దృష్టి సారించడం వంటి కారణాల వల్ల స్మార్ట్‌ఫోన్‌ల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది.

   మొత్తం స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల్లో 200 డాలర్లలోపు స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు 78 శాతంగా ఉన్నాయి.

  ఇక స్మార్ట్‌ఫోన్‌ల ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఆండ్రాయిడ్ ఓఎస్‌దే హవా. అందుబాటు ధరల్లో విండోస్ ఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వస్తుండటంతో విండోస్ ఓఎస్ వాటా కూడా పెరుగుతోంది.

  స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్‌సంగ్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో శామ్‌సంగ్ 35 శాతం మార్కెట్ వాటా సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(15%), కార్బన్(10%), లావా(6%), నోకియా (4శాతం)లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు