స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతుల భారీ పతనం

18 Jul, 2020 12:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సంక్షోభం స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్-జూన్ కాలంలో స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు భారీగా పడిపోయాయి. ప్రధానంగా చైనా  స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి, దక్షిణకొరియా సంస్థ శాంసంగ్‌ అనూహ్య పతనాన్ని చవిచూశాయి.

కెనాలిస్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో 48శాతం స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు క్షీణించాయి. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 17.3 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే ఎగుమతయ్యాయి. అంతకుముందు సంవత్సరంలో ఎగుమతులు 33 మిలియన్లు యూనిట్లుగా ఉంది. ఈ ప్రభావం టాప్10 బ్రాండ్లలో ఒకటైన ఆపిల్‌పై తక్కువగానూ, శాంసంగ్‌ ఎక్కువగానూ ప్రభావితమైందని నివేదిక పేర్కొంది. అయితే మార్కెట్‌ లీడర్‌ షావోమి ఎగుమతులు భారీగా క్షీణించినప్పటికీ, తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. 

శాంసంగ్‌ మార్కెట్ వాటా 60 శాతం పడిపోయింది. అంతకుముందు 22.1శాతం నుంచి ప్రస్తుతం 16.8 శాతానికి క్షీణించింది. వియత్నాం వెలుపల తన అతిపెద్ద ఉత్పాదక కర్మాగారం మూసివేయడం ఈ త్రైమాసికంలో పెద్ద దెబ్బ అని శాంసంగ్‌ వెల్లడించింది. షావోమి మార్కెట్‌ వాటా  48 శాతం క్షీణతతో  30.9 శాతానికి చేరింది. గత ఏడాది ఇది 31.3 శాతంగా ఉంది. వివో ఎగుమతులు కూడా 36 శాతం పడిపోయాయి. అయితే దాని మార్కెట్ వాటా అంతకు ముందు సంవత్సరం 17.5 శాతం నుండి 21.3 శాతానికి పెరిగింది. రియల్‌మిని అధిగమించి ఒప్పో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. ఒప్పో ఎగుమతులు 27 శాతం తగ్గాయి. రియల్‌మీ ఎగుమతులు 35 శాతం పడిపోగా, ఆపిల్ ఎగుమతులు 20 శాతం క్షీణతను నమోదు చేశాయి.

లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత  డిమాండ్‌ స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, దేశీయ స్టార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఇంకా ఇబ్బందుల్లోనే ఉందని కెనాలిస్ ఎనలిస్ట్‌ మధుమితా చౌదరి తెలిపారు. లాక్‌డౌన్‌, ఉత్పత్తి ప్లాంట్లు మూత, సిబ్బంది కొరతతో స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు కష్టాలు పడుతున్నాయని  దీనికి తోడు తయారీ కొత్త నిబంధనలు కూడా ప్రభావితం చేశాయన్నారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ  షావోమి, ఒప్పో, వివో, రియల్‌మిపై ప్రభావం తక్కువగా ఉంటుందని మరో విశ్లేషకుడు అద్వైత్ మార్దికర్ వ్యాఖ్యానించారు.  ఎందుకటే ధరల విషయంలో శాంసంగ్‌, నోకియా, ఆపిల్‌  పోటీ ఇవ్వలేకపోతున్నాయన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు