చిక్కుల్లో స్నాప్‌డీల్‌: నోటీసులు

14 Aug, 2017 11:17 IST|Sakshi

ముంబై:  ఇ-కామర్స్ సంస్థ  స్నాప్‌డీల్‌ మరోసారి చిక్కుల్లో పడింది.  వన్య ప్రాణుల అవయవాలనుంచి తయారు చేసిన ఉత్పత్తులను  విక్రయిస్తోందని ఆరోపిస్తూ స్నాప్‌డీల్‌ సహా, మరికొన్ని సంస్థలకు  నోటీసులు జారీ  అయ్యాయి.  వెంటనే ఆయా ఉత్పత్తులను తొలించాలని,  దీనిపై  చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలంటూ ఆదేశించినట్టు ప్రజా సంబంధాల విభాగం అధికారి ఒకరు తెలిపారు.

స్నాప్‌డీల్‌తో పాటు విష్ అండ్ బిట్, ఇండియా మార్ట్, క్రాఫ్ట్  కంపారిజన్‌ వెబ్‌సైట్లకు   మధ్యప్రదేశ్ టైగర్ స్ట్రైక్ ఫోర్స్ ఈ నోటీసులిచ్చింది.  దీనిపై తక్షణమే వివరణ  ఇవ్వాల్సిందిగా కోరింది.  

కాగా ఇండోర్  విజయ్ నగర్‌లోని  శుభభక్తి స్నాప్‌డీల్‌  ద్వారా  అడవి జంతువుల అవయవాలు నుండి తయారు చేసిన "హత్తా-జోడి"  "సియర్-సింఘి"లాంటి ఉత్పత్తులను  స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ నోటీసులు జారీ అయ్యాయి. అలాగే  ఈ వ్యవహారంలో శుభభక్తి  సంస్థ యజమానులు సుమిత్ శర్మ ,  ఫిరోజ్ ఆలీని  పోలీసులు గత వారం అరెస్టు చేశారు. వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్ యాక్ట్ కింద  కేసును దాఖలు చేశారు. అయితే ఇ-కామర్స్ పోర్టల్స్ స్నాప్‌డీల్, ఇండియా మార్ట్, విష్ అండ్ బై  వెబ్‌సైట్ల ద్వారా ఈ వస్తువులను విక్రయించినట్టు  దర్యాప్తు సమయంలో  వీరు వెల్లడించారు.  పూజ పదార్ధాల వర్తకంతో పాటు  వన్యప్రాణుల సంబంధిత వస్తువులను విక్రయిస్తున్నట్టు తేలిందని  దర్యాప్తు అధికారి తెలిపారు.  ధనవంతులు కావడం, కోర్టు కేసులనుంచి విముక్తి,  వ్యాపార వృద్ధి తదితర సమస్యలకు  పరిష‍్కారంగా  వీటిని జనం  విశ్వసిస్తారని  ఆయన చెప్పారు.  

 

మరిన్ని వార్తలు