బ్రాండ్స్‌కు ఆమిర్‌ఖాన్ సెగ!

26 Nov, 2015 03:31 IST|Sakshi
బ్రాండ్స్‌కు ఆమిర్‌ఖాన్ సెగ!

స్నాప్‌డీల్, గోద్రెజ్‌పై నెటిజన్ల ఆగ్రహం
 స్నాప్‌డీల్ యాప్ వాపసీ నినాదంతో
 హోరెత్తిన సోషల్ మీడియా
 వివరణ ఇచ్చుకున్న కంపెనీలు


 న్యూఢిల్లీ: భారత్‌లో అసహన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనతో అనుబంధమున్న స్నాప్‌డీల్, గోద్రెజ్ సంస్థలకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఆమిర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆన్‌లైన్ షాపింగ్ సైటు స్నాప్‌డీల్‌కు సెగ ఎక్కువగా తాకింది. ఆమిర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నెటిజన్లు ఆయనపై నిప్పులు చెరుగుతూ పనిలోపనిగా స్నాప్‌డీల్‌పైనా విరుచుకుపడ్డారు.
 
  ఆమిర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించే దాకా కంపెనీ నుంచి కొనుగోళ్లు చేసే ప్రసక్తే లేదంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. అంతే కాదు అప్పటికప్పుడు యాప్ వాపసీ నినాదం రూపొందించి.. స్నాప్‌డీల్ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఒకానొక దశలో దాదాపు 85,000 మంది పైచిలుకు యూజర్లు.. యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ కూడా చేసేసినట్లు అంచనా. పనిలో పనిగా గూగుల్ ప్లే స్టోర్‌లో స్నాప్‌డీల్ రేటింగ్‌లను కూడా తగ్గించేశారు. ఆమిర్‌ఖాన్‌తో స్నాప్‌డీల్ అనుబంధం కారణంగా.. కంపెనీ యాప్‌కు కేవలం 1 స్టార్ రేటింగ్ (గరిష్టం 5 స్టార్లు) ఇచ్చారు. ఆమిర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన కార్పొరేట్ దిగ్గజం గోద్రెజ్‌ను కూడా టార్గెట్ చేశారు కొందరు.
 
 నష్టనివారణ చర్యల్లో కంపెనీలు..
 ఆమిర్‌ఖాన్ వివాదంలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో స్నాప్‌డీల్, గోద్రెజ్‌లు అర్జ్జెంటుగా నష్టనివారణ చర్యలకు దిగాయి. ఈ విషయంలో తమ ప్రమేయమేదీ లేదంటూ ఇరు సంస్థలు వివరణ ఇచ్చుకున్నాయి. ఆమిర్ ఖాన్ వ్యక్తిగత హోదాలో చేసిన వ్యాఖ్యలకు తమకు ఎటువంటి సంబంధమూ లేదని స్నాప్‌డీల్ స్పష్టం చేసింది. భారీ సంఖ్యలో భారతీయ కొనుగోలుదారులకు ప్రయోజనాలు చేకూరుస్తున్నామని వివరించింది.
 
 వేల కొద్దీ చిన్న వ్యాపారసంస్థలకు తోడ్పాటుగా నిలుస్తున్నామని, పది లక్షలపైగా ఆన్‌లైన్ వ్యాపారవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యం దిశగా ముందుకు సాగుతామని పేర్కొంది. అటు గోద్రెజ్ సైతం తన వంతు వివరణ ఇచ్చుకుంది. ఆమిర్‌ఖాన్ 2013 నుంచి 2014 దాకా మాత్రమే తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని, గతేడాది మార్చిలోనే ఆయనతో కాంట్రాక్టు ముగిసిపోయిందని తెలిపింది.

 స్నాప్‌డీల్‌కు ఫ్లిప్‌కార్ట్ బన్సల్ బాసట..
 ఆమిర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో స్నాప్‌డీల్‌కు మరో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ బాసటగా నిల్చారు. ఆమిర్ ఖాన్ వ్యక్తిగత కామెంట్లను పట్టుకుని స్నాప్‌డీల్‌పై ఆగ్రహించడం సరికాదని బన్సల్ వ్యాఖ్యానించారు. కంపెనీలు.. బ్రాండ్ అంబాసిడర్ల వ్యక్తిగత అభిప్రాయాలకు బాధ్యత వహించలేవని కూడా ఆయన పేర్కొన్నారు.
 
 నెట్ న్యూట్రాలిటీ వ్యవహారంలో ఇలాగే సమస్యల్లో చిక్కుకున్న బన్సల్.. గత అనుభవంతో స్నాప్‌డీల్‌కు బాసటగా నిల్చినట్లు సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. గతంలో టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌తో ఫ్లిప్‌కార్ట్ చేతులు కలపడం.. నెట్ న్యూట్రాలిటీ (ఇంటర్నెట్ సర్వీసులు అందించడంలో తటస్థ వైఖరి పాటిండచం) విధానానికి విరుద్ధమంటూ వివాదం రేగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఫ్లిప్‌కార్ట్ యాప్ కూడా రేటింగ్ డౌన్‌గ్రేడ్ కష్టాలు ఎదుర్కొనాల్సి రావడం గమనార్హం.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు