స్నాప్‌డీల్‌లో 15% వేతనాల పెంపు!

13 Apr, 2017 00:35 IST|Sakshi
స్నాప్‌డీల్‌లో 15% వేతనాల పెంపు!

న్యూఢిల్లీ: నిధుల కొరత ఎదుర్కొంటున్న ఈ కామర్స్‌ దిగ్గజం స్నాప్‌డీల్‌.. ఉద్యోగుల్లో భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి 15 శాతం దాకా వేతనాలు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మధ్య, జూనియర్‌ స్థాయి ఉద్యోగుల జీతాలు సగటున 12–15 శాతం పెరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగులకు పెంపు 9–12 శాతంగా ఉండొచ్చని... అసాధారణ పనితీరు కనపర్చిన వారికి 20–25 శాతం దాకా ఉండగలదని వివరించాయి. పే రివిజన్‌ ఏప్రిల్‌ 1 నుంచి వర్తింపచేయవచ్చని సమాచారం.

ఉద్యోగులకు షేర్లు కూడా...
కంపెనీ షేర్లలో 1 శాతాన్ని సుమారు 150 మంది ఉద్యోగులకు పంపిణీ చేయవచ్చని స్నాప్‌డీల్‌ వర్గాలు తెలియజేశాయి. స్నాప్‌డీల్‌ ఈ–కామర్స్‌ కార్యకలాపాల్లో 3,000 మంది పైచిలుకు ఉద్యోగులున్నారు. ఇది కాకుండా మొబైల్‌ వాలెట్‌ (ఫ్రీచార్జ్‌), లాజిస్టిక్స్‌ (వల్కన్‌) కార్యకలాపాలు కూడా కంపెనీకి ఉన్నాయి. ప్రస్తుత, మాజీ ఉద్యోగులందరికీ కలిపి స్నాప్‌డీల్‌లో ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్స్‌ రూపంలో 5–6 శాతం వాటాలున్నాయి.

అత్యధికంగా పెట్టుబడులున్న సాఫ్ట్‌బ్యాంక్‌ సంస్థ.. నిధుల కొరత ఎదుర్కొంటున్న స్నాప్‌డీల్‌ను విక్రయించే యత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వేల్యుయేషన్‌పై ఏకాభిప్రాయం సాధించేందుకు మిగతా భాగస్వాములైన కలారి క్యాపిటల్, నెక్సస్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌తో కూడా సాఫ్ట్‌బ్యాంక్‌ చర్చలు జరుపుతోంది. ఇటీవలే 1.4 బిలియన్‌ డాలర్లు సమకూర్చుకున్న పోటీ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. స్నాప్‌డీల్‌ కొనుగోలు రేసులో ముందుంది.
 

>
మరిన్ని వార్తలు