ఈ ఏడాది భారత్‌ వృద్ధి 7.2%!

6 Jun, 2017 00:48 IST|Sakshi
ఈ ఏడాది భారత్‌ వృద్ధి 7.2%!

ప్రపంచబ్యాంక్‌ అంచనా
డీమోనిటైజేషన్‌ ప్రభావం నుంచి బయటపడుతోందని విశ్లేషణ
 
వాషింగ్టన్‌: భారత్‌ డీమోనిటైజేషన్‌ ప్రభావం నుంచి బయటపడుతోందని ప్రపంచబ్యాంక్‌ తన తాజా నివేదికలో అంచనావేసింది. 2016లో వృద్ధి 6.8 శాతంగా నమోదయితే, 2017లో 7.2 శాతానికి చేరుతుందని విశ్లేషించింది. 2017లో కూడా వృద్ధి 6.8 శాతంగానే ఉంటుందని జనవరిలో ప్రపంచబ్యాంక్‌ అంచనావేసింది. అయితే అప్పటి అంచనాను ఇప్పుడు 40 బేసిస్‌ పాయింట్లు పెంచడం గమనార్హం. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాతుందని తాము భావిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్‌ అధికారులు తెలిపారు.

2018లో 7.5 శాతం 2019లో 7.7 శాతం మేర భారత్‌ వృద్ధి నమోదవుతుందని తన తాజా ‘గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్స్‌’లో ప్రపంచబ్యాంక్‌ అభిప్రాయపడింది. అయితే ఈ అంచనాలను ఇంతక్రితం (జనవరి 2017)తో పోల్చితే వరుసగా 0.3 శాతం, 0.1 శాతం మేర తగ్గించడం గమనార్హం. ప్రైవేటు పెట్టుబడులు ఊహించినదానికన్నా తక్కువగా ఉండడం దీనికి కారణంగా పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే...

ఈ ఏడాది భారత్‌ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యత మెరుగుపడ్డం, ఎగుమతుల్లో వృద్ధి దీనికి ప్రధాన కారణాలు. ప్రభుత్వ వ్యయాలూ పెరుగుతున్నాయి.
దేశీయ డిమాండ్‌ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రభుత్వ విధాన సంస్కరణలు దీనికి ప్రధాన కారణం. ప్రత్యేకించి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుకు ప్రభుత్వ చొరవను ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
రాష్ట్ర ఎన్నికల్లో కేంద్రంలోని పాలక పార్టీ గణనీయ విజయాలు, ప్రభుత్వ ఆర్థిక అజెండాను కొనసాగించడానికి దోహదపడతాయి. సరఫరాల అడ్డంకుల సమస్యలను అధిగమించడం, తగిన వాతావరణ పరిస్థితుల సృష్టి వంటి అంశాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడే వీలుంది.
బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచబ్యాంక్‌ అభివృద్ధి విభాగ డైరెక్టర్‌ అహాన్‌ కోస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు