సాఫ్ట్‌బ్యాంక్‌ ‘రికార్డు’ ఐపీవో

20 Dec, 2018 00:20 IST|Sakshi

23.5 బిలియన్‌ డాలర్ల సమీకరణ

లిస్టింగ్‌లో మాత్రం 15% డౌన్‌

టోక్యో: జపాన్‌ టెక్నాలజీ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ పబ్లిక్‌ ఇష్యూతో (ఐపీవో) రికార్డు సృష్టించింది. ఐపీవో ద్వారా 2.65 లక్షల కోట్ల యెన్‌లు (సుమారు 23.5 బిలియన్‌ డాలర్లు) సమీకరించింది. జపాన్‌లో ఇది అతి పెద్ద ఐపీవో కాగా.. అంతర్జాతీయంగా భారీ పబ్లిక్‌ ఇష్యూల్లో రెండోది. 2014 నాటి చైనీస్‌ ఈకామర్స్‌ దిగ్గజం ఆలీబాబా ఐపీవో తర్వాత అంతటి భారీ పబ్లిక్‌ ఇష్యూ ఇదే. అప్పట్లో ఆలీబాబా సుమారు 25 బిలియన్‌ డాలర్లు సమీకరించింది. మరోవైపు, రికార్డు ఐపీవో అయినప్పటికీ.. లిస్టింగ్‌లో మాత్రం సాఫ్ట్‌బ్యాంక్‌ షేర్లు భారీగానే క్షీణించాయి. ఇష్యూ ధర షేరు ఒక్కింటికి 1,500 యెన్‌లు కాగా.. ఓపెనింగ్‌లోనే 1,463 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది.

ఆ తర్వాత అమ్మకాలు మరింత వెల్లువెత్తడంతో 14.5 శాతం క్షీణించి 1,282 యెన్‌ల వద్ద క్లోజయ్యింది. షేరు ధర గణనీయంగా పడిపోవడం దురదృష్టకరమని సాఫ్ట్‌బ్యాంక్‌ కార్పొరేషన్‌ సీఈవో కెన్‌ మియోచి వ్యాఖ్యానించారు. అయితే, ఇది ఆరంభం మాత్రమేనని, క్రమంగా పరిస్థితులు మెరుగుపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లు అస్తవ్యస్తంగా మారటం, మొబైల్‌ సంస్థల భారీ చార్జీలపై జపాన్‌లో విధాననిర్ణేతలు గుర్రుగా ఉండటం తదితర అంశాలు సాఫ్ట్‌బ్యాంక్‌ లిస్టింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపి ఉంటాయని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. 

మరిన్ని వార్తలు