కొద్ది వారాల్లోనే స్నాప్‌డీల్‌ విక్రయ డీల్‌!

6 Apr, 2017 00:23 IST|Sakshi
కొద్ది వారాల్లోనే స్నాప్‌డీల్‌ విక్రయ డీల్‌!

మద్దతు కూడగట్టే దిశగా సాఫ్ట్‌బ్యాంక్‌
న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ను విక్రయించే ఆలోచనతో ఉన్న జపాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ ఈ విషయమై తన ప్రయత్నాలను ముమ్మరం చేయనుంది. వచ్చే కొన్ని వారాల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం... మంగళవారం స్నాప్‌డీల్‌ బోర్డు భేటీ జరిగింది. కంపెనీ విక్రయ ప్రతిపాదనపై ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంకు అదిపెద్ద వాటాదారునిగా ఉంది.

అయినప్పటికీ విక్రయ ప్రతిపాదనకు ఇతర డైరెక్టర్ల మద్దతును కూడగట్టాలన్న ఆలోచనతో ఉంది. స్నాప్‌డీల్‌ విక్రయంపై వచ్చే 4 నుంచి 8 వారాల్లో నిర్ణయం వెలువడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. స్నాప్‌డీల్‌ను దేశీయ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పేటీఎం పేరు కూడా తెరపైకి వచ్చింది. పేటీఎంలో ప్రముఖ వాటాదారునిగా ఉన్న అలీబాబా స్నాప్‌డీల్‌లోనూ వాటా కలిగి ఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు