సాఫ్ట్ బ్యాంకుకు 9వేల కోట్లు హుష్ కాకి

10 May, 2017 18:32 IST|Sakshi
సాఫ్ట్ బ్యాంకుకు 9వేల కోట్లు హుష్ కాకి
న్యూఢిల్లీ : భారత్ లో పెట్టుబడులతో జపనీస్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ భారీ నష్టాలను మూటగట్టుకుంది.  2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 1.4 బిలియన్ డాలర్లు లేదా 9000 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్టు ఈ గ్రూప్ బుధవారం పేర్కొంది. ముఖ్యంగా దేశీయ స్టార్టప్స్ స్నాప్ డీల్, ఓలా కంపెనీ వల్ల సాఫ్ట్ బ్యాంకుకు ఈ మేర నష్టాలొచ్చినట్టు తెలిసింది. సబ్సిడరీలు, అసోసియేట్ల షేర్లు విలువ నష్టాలతో 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ మేర కంపెనీకి నష్టాలొచ్చాయని సాఫ్ట్ బ్యాంకు వెల్లడించింది. దానిలో స్నాప్ డీల్ మాతృ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లు కలిగి ఉన్న స్టార్ ఫిష్ ఐ పీటీఈ లిమిటెడ్ ముఖ్యమైందని తెలిపింది. అంతేకాక భారత్ లో తన రెండో అతిపెద్ద పెట్టుబడుల సంస్థ ఓలా వల్ల కూడా 400 మిలియన్ డాలర్లు నష్టపోయినట్టు పేర్కొంది. దీంతో స్నాప్ డీల్, ఓలా వల్ల ఫేర్ వాల్యు వద్ద 1.4 బిలియన్ డాలర్ల నష్టాలను నమోదుచేసినట్టు వెల్లడించింది.   
 
భారత్ లో ఈ-కామర్స్ మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ, అంచనావేసిన దానికంటే మరింత తక్కువగా స్నాప్ డీల్ ప్రదర్శన ఉందని సాఫ్ట్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. స్నాప్ డీల్ అత్యల్ప ప్రదర్శనతో స్టార్ ఫిష్ నికర ఆస్తి విలువ తగ్గిపోయినట్టు ఈ టెలికమ్యూనికేషన్ దిగ్గజం పేర్కొంది. దేశీయ స్టార్టప్ ఎకో సిస్టమ్ లో సాఫ్ట్ బ్యాంకు అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్టర్. ఇప్పటివరకు 2 బిలియన్ డాలర్లకు పైగా(12,911 కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం స్నాప్ డీల్ ను దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు విక్రయించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. స్నాప్ డీల్ లో సాఫ్ట్ బ్యాంకు 900 మిలియన్ డాలర్ల(5,810కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ఈ  ఏడాది మొదట్లో కూడా స్నాప్ డీల్, ఓలాల వల్ల 350 మిలియన్ డాలర్ల నష్టాలు వచ్చినట్టు సాప్ట్ బ్యాంకు తెలిపిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు