ఈ ఏడాది ఐటీ రంగం వృద్ధి 8 శాతమే!

23 Jun, 2017 00:39 IST|Sakshi
ఈ ఏడాది ఐటీ రంగం వృద్ధి 8 శాతమే!

గతేడాది 7.5 శాతం; 1.5 లక్షల ఉద్యోగ అవకాశాలు
జపాన్, చైనా, ఆఫ్రికా ఐరోపా దేశాలకు విస్తరణ: నాస్కామ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత ఐటీ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం (2017–18)లో స్వల్ప పెరుగుదలతో 8 శాతానికి చేరుతుందని నాస్కామ్‌ అంచనా వేసింది. అయితే దేశీయ ఐటీ విపణి మాత్రం 10–11 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. ‘‘2017–18 ఆర్ధిక సంవత్సరంలో ఐటీ–బీపీఎం రంగాల్లో కొత్తగా 1.3–1.5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలొస్తాయని.. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నికర నియామకాలు 1.7 లక్షలుగా ఉందని’’ నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.చంద్రశేఖర్‌ తెలిపారు.

అమెరికా హెచ్‌1బీ వీసాపై ఆంక్షలు, బ్రెగ్జిట్‌ ఇతర అంతర్జాతీయ మార్కెట్లో రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు ఇందుకు కారణమని.. స్థానిక ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఖర్చులు, అలాగే గతేడాది ఐటీ కంపెనీల పనితీరును వంటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఐటీ రంగం సానుకూలంగా ఉంటుందని ఆయన వివరించారు. దేశీయ ఐటీ పరిశ్రమ పరిమాణం 154 బిలియన్‌ డాలర్లని.. గత ఆర్థిక సంవత్సరంలో 11 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలియజేశారు.

కొత్త భౌగోళికాలకు విస్తరణ..
బ్యాంకింగ్, ఆర్థిక, హెల్త్‌కేర్‌ వంటి అన్ని రంగాలు అనిశ్చితిలో ఉన్నాయని.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం కారణంగా ఐటీ రంగంలోనూ అవకాశాలు సన్నగిల్లాయని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం దేశీయ ఐటీ పరిశ్రమలో డిజిటల్‌ విప్లవం నడుస్తోంది. ప్రస్తుతమున్న 15–20 లక్షల మంది ఐటీ నిపుణులు తమ నైపుణ్యాలకు సానబెట్టి.. భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండాలి’’ అని చంద్రశేఖర్‌ సూచించారు. భారత ఐటీ పరిశ్రమ 80%కి పైగా అమెరికా, యూకే వంటి దేశాలపై ఆధారపడి ఉంది. కొత్తగా ఐరోపా, జపాన్, చైనా, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాల్లో విస్తరిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు