పతనాల్లో కొంత రక్షణ

1 Apr, 2019 00:40 IST|Sakshi

ప్రిన్సిపల్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌

ఎన్నికల ముందు మార్కెట్లలో అస్థిరతల పట్ల ఆందోళనతో ఉన్న వారు, మార్కెట్‌ కరెక్షన్లలో కాస్తంత అయినా తమ పెట్టుబడులకు కుదుపుల నుంచి రక్షణ ఉండాలని భావించే వారు, అదే సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులపై కాస్త అధిక రాబడులు ఆశించే వారికి ప్రిన్సిపల్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ కూడా ఒక ఎంపిక అవుతుంది. ఇది అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌. పెట్టుబడుల్లో గరిష్టంగా 35 శాతాన్ని తీసుకెళ్లి డెట్‌సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీంతో మార్కెట్‌ పతనాల్లో ఎన్‌ఏవీ ఘోరంగా పతనం కాకుండా డెట్‌ పెట్టుబడులు మేలు చేస్తాయి. అలాగే, ఈక్విటీల్లో గరిష్టంగా 65 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీల్లో అధిక రాబడులు పొందేందుకు వీలు పడుతుంది. హైబ్రిడ్‌ ఫండ్స్‌ నుంచి ఉన్న రెండిందాల ప్రయోజనాలు ఇవే. ఈ విభాగంలో ప్రిన్సిపల్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకం మంచి రాబడులతో మెరుగైన స్థానంలో ఉంది. గతంలో ప్రిన్సిపల్‌ బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ పేరుతో కొనసాగగా... సెబీ పథకాల పునర్వ్యవస్థీకరణ ఆదేశాల తర్వాత పేరులో మార్పు చోటు చేసుకుంది. 

పెట్టుబడుల విధానం  
అన్ని మార్కెట్‌ పరిస్థితుల్లోనూ ఈ పథకం పెట్టుబడుల విషయంలో అప్రమత్త ధోరణితో కొనసాగుతుంది. ఈక్విటీలకు పెట్టుబడులను 70 శాతం వరకు కేటాయించడం అన్నది అరుదుగా మాత్రమే ఈ ఫండ్‌ మేనేజర్‌ చేస్తుంటారు. 2017 బుల్‌ మార్కెట్, 2018 బేర్‌ మార్కెట్‌  సమయాల్లో ఈ పథకం ఈక్విటీల్లో పెట్టబడులను 65–68 శాతం మధ్య కొనసాగించింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ హైబ్రిడ్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ప్రిన్సిపల్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పనితీరు మెరుగ్గా ఉండడం గమనార్హం. 2017 ర్యాలీలో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉండడం వల్ల అద్భుత పనితీరు చూపించింది. సమస్యాత్మకమైన సాఫ్ట్‌వేర్, ఫార్మా వంటి విభాగాల్లో ఆ ఏడాది పెట్టుబడులను తగ్గించుకుంది. ఇక 2018లో సురక్షితంగా కనిపించిన కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ స్టాక్స్‌ను యాడ్‌ చేసుకుంది. తద్వారా అస్థిరతల ప్రభావాన్ని తగ్గించుకుంది. అలాగే, రూపాయి బలోపేతం అవుతుండడంతో ఐటీ స్టాక్స్‌లో పెట్టుబడులను పెంచుకోవడం ఆరంభించింది. దీనికితోడు అస్థిరతల ప్రభావం తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్‌కు ప్రాధాన్యం పెంచింది. 2018 ఆరంభంలో మిడ్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు 25 శాతంగా ఉండగా, వాటిని 20%కి తగ్గించుకుంది. ఇక డెట్‌ విభాగంలోనూ పలు మార్పులు చేసుకుంది. 10 ఏళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్‌ 6.5% నుంచి 8%కి పెరగడంతో ఈ ఇన్‌స్ట్రుమెంట్లలో ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు, పెట్టుబడుల విధానాల కారణంగా ఈ పథకం హైబ్రిడ్‌ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తోంది.  

రాబడులు..: ఈ పథకం ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 2.5%. ఇదే సమయంలో ఈ విభాగం సగటు రాబడులు 2.2% ఉన్నాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే ఈ పథకం వార్షికంగా ఇచ్చిన రిటర్నులు 16.7% ఉన్నాయి. ఈ విభాగం సగటు రాబడులు 11.2%∙ఉండడం గమనార్హం. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు వార్షికంగా 15.1% ఉంటే, విభాగం రాబడులు 12.4%గానే ఉన్నాయి. 

 

>
మరిన్ని వార్తలు