సాగరతీరంలో సొనాలికా ప్లాంట్‌!

6 Dec, 2017 00:06 IST|Sakshi

ఏపీని కూడా పరిశీలిస్తున్నాం

గుజరాత్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపాం

‘సొనాలికా ఐటీఎల్‌’ వైస్‌చైర్మన్‌ ఏఎస్‌ మిట్టల్‌  

కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా దేశంలో రెండో ప్లాంటును ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు ట్రాక్టర్ల తయారీ సంస్థ సొనాలికా ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ఎగుమతులకు అనుకూలంగా ఉండేందుకు కొత్త ప్లాంటును సముద్ర తీరంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ వైస్‌ చైర్మన్‌ అమృత్‌సాగర్‌ మిట్టల్‌ చెప్పారు. ఇందులో భాగంగా అనువైన ప్రాంతం కోసం అన్వేషిస్తున్నామని తెలియజేశారు. పరిస్థితులు అనుకూలించి, ప్రభుత్వం చేయూతనిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనైనా ప్లాంట్‌ ఏర్పాటు చేయటానికి సిద్ధమని చెప్పారాయన. ఇప్పటికైతే ఈ దిశగా ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, కానీ గుజరాత్‌ ప్రభుత్వంతో మాత్రం సూత్ర ప్రాయ చర్చలు జరిపామని తెలియజేశారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ ప్లాంటులో‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...

సొనాలికా ట్రాక్టర్స్‌ అమ్మకాలెలా ఉన్నాయి? మార్కెట్లో మీ వాటా ఎంత?
గతేడాది ట్రాక్టర్ల పరిశ్రమ 17 శాతం వార్షిక వృద్ధి సాధించింది. ఇదే సమయంలో మా కంపెనీ 19 శాతం వృద్ధిని అందుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష ట్రాక్టర్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికి దాదాపు 50 వేల యూనిట్లు విక్రయించాం. వచ్చే ఐదేళ్లలో 2.5 లక్షల ట్రాక్టర్ల వార్షిక విక్రయాలను లకి‡్ష్యంచాం. దేశీయ ట్రాక్టర్ల మార్కెట్లో మాది మూడో స్థానం. మొత్తం ట్రాకర్ల మార్కెట్లో మా వాటా సుమారు 12.3 శాతం. కానీ 45 హెచ్‌పీ విభాగంలో 15 శాతం వాటా ఉంది. ప్రస్తుతం 20– 120 హెచ్‌పీ వరకు వివిధ విభాగాల్లో ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నాం. హోషియార్‌పూర్‌ ప్లాంటు కొత్తది. ప్రపంచంలోనే అతిపెద్దది. రూ.2 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వివిధ రకాల ఉత్పత్తులు మా పోర్టు ఫోలియోలో ఉన్నాయి.  

మరి ఎగుమతుల సంగతో..?
మా వార్షిక విక్రయాల్లో ఎగుమతుల వాటా 15 శాతం పైనే ఉంది. వచ్చే ఐదేళ్లలో ఎగుమతుల వాటా 22 శాతానికి చేర్చాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం 90కి పైగా దేశాలకు ‘సొలెస్‌’ బ్రాండ్‌తో మా ట్రాక్టర్లను ఎగుమతి చేస్తున్నాం. ఎగుమతుల పరంగా ఆల్జీరియా మాకు అతిపెద్ద మార్కెట్‌. ఎగుమతులను మరింత పెంచుకునేందుకు త్వరలో చైనాకు చెందిన ఒక కంపెనీతో జేవీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం.

దేశీయంగా విస్తరణ ఎలా ఉంది? ప్రత్యేకించి దక్షిణాదిలో..?
కొన్నాళ్లుగా దక్షిణాదిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాం. సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలకు కూడా తెలుగు రాష్ట్రాలనే ఎంచుకున్నాం. దేశీయంగా విస్తరించేందుకు వచ్చే మూడు నాలుగేళ్లలో కొత్తగా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రస్తుతానికి తాజా ప్లాంట్‌ ఉత్పత్తి సామర్ధ్యం మాకు సరిపడేంత ఉంది. దక్షిణాదిన విస్తరించి డిమాండ్‌ బాగా పెరిగితే కొత్త ప్లాంట్‌ ఏర్పాటు ఊపందుకుంటుంది. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్‌ను వీలయితే సాగరతీరంలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఏపీని సైతం పరిశీలిస్తున్నాం. అన్ని అనుకూలంగా జరిగితే కొత్త ప్లాంట్‌ను దక్షిణాదిన ఏర్పాటు చేస్తాం.

కంపెనీ లిస్టింగ్‌కు వచ్చే ఆలోచన ఉందా?
సొనాలికాకు ఎలాంటి రుణాలూ లేవు. పైపెచ్చు కంపెనీ వద్ద రూ.2,500 కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి. జపాన్‌కు చెందిన ఆటో ఇంజన్ల ఉత్పత్తి దిగ్గజం యాన్‌మార్‌కు మా సంస్థలో 30 శాతం వాటా ఉంది. గతంలో బ్లాక్‌స్టోన్‌కున్న వాటాను సైతం యాన్‌మార్‌ కొనుగోలు చేసింది. కంపెనీ మూలాలు బలంగా ఉన్నందున ఇప్పట్లో మార్కెట్లో లిస్టింగ్‌కు రావాలని భావించడం లేదు.  

దేశీయంగా ట్రాక్టర్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి?
భారత్‌ ప్రధానంగా రుతుపవన ఆధారిత దేశం. దీంతో వ్యవసాయ రంగం బాగా ఒడిదుడుకులకు గురవుతోంది. ట్రాక్టర్ల పరిశ్రమ కూడా ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి సారించి ఏటా బడ్జెట్‌ కేటాయింపులు పెంచుకుంటూ పోతోంది. కానీ ఈ ప్రయోజనాలు రైతులకు అందకుండా బ్యాంకులు అడ్డంపడుతున్నాయి. దీంతో రైతులు ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర మార్గాల్లో ఎక్కువవడ్డీలకు రుణాలు తీసుకుని ఇక్కట్లు పడుతున్నారు. బ్యాంకులు ఇకనైనా వ్యవసాయ యాంత్రీకరణకు చేయూతనిచ్చేలా యంత్రాలు తక్కువ వడ్డీకి కొనుగోలు చేసేందుకు సహకరించాలి. ప్రభుత్వం కూడా ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. 
-  (హోషియార్‌పూర్‌ నుంచి డి.సాయి ప్రమోద్‌)

>
మరిన్ని వార్తలు