ఇక రైళ్లలో సీసీ టీవీ కెమెరాలు, వైఫై

18 Mar, 2018 18:53 IST|Sakshi

సాక్షి. లక్నో : దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీటీవీ కెమెరాలు, వైఫై కనెక్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్టు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. తమ ప్రభుత్వం అన్ని రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా, సురక్షితంగా ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దుతుందని చెప్పారు. అన్ని రైళ్లలో త్వరలో సీసీటీవీ కెమెరాలు, వైఫై సదుపాయాలను కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆదివారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో్ మంత్రి మాట్లాడుతూ రైల్వేల్లో 90,000 మంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు.

రైల్వేల అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆయన ఆరోపించారు. రాయ్‌బరేలి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. కాగా తేజాస్‌, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఎల్‌సీడీ స్ర్కీన్‌లను తొలగించాలని రైల్వేలు నిర్ణయించిన అనంతరం మంత్రి సీసీటీవీ కెమెరాలు, వైఫై ఏర్పాటు చేస్తామని ప్రకటించడం గమనార్హం. కొందరు ప్రయాణీకులు ఎల్‌సీడీ స్క్రీన్లను ధ్వంసం చేయడం, అపహరించడం వంటి ఘటనలకు పాల్పడుతున్న క్రమంలో రైళ్లలో వాటిని శాశ్వతంగా తొలగించాలని రైల్వేలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు