బటన్ నొక్కండి.. లోన్ పట్టండి!

3 May, 2016 20:14 IST|Sakshi
బటన్ నొక్కండి.. లోన్ పట్టండి!

న్యూఢిల్లీ: మీకు డబ్బు అత్యవసరమా..? ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, అందుకు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ లోని వాలెట్ నుంచి లోన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను జరిపే ప్రముఖ కంపెనీలు పే వరల్డ్, పేటీఎమ్, వన్ మొబీక్విక్ లు ఈ పద్దతికి పచ్చజెండా ఊపేశాయి.

త్వరలో ఈ పద్ధతిలో చిన్న మొత్తాల్లో రుణాలు అందించనున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. మే తొలి అర్ధ భాగంలో ఈ పద్దతిని యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్లు మొబీవిక్ వ్యవస్థాపపకుడు బిపిన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మొదట రూ.100 నుంచి రూ.500 ఎలిజిబుల్ యూజర్ వాలెట్కు చేరుతుందని చెప్పారు. తర్వాత రూ.5000/- వరకు రుణం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు.

అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని, మామూలు బ్యాంకింగ్ రంగంలో ఎటువంటి రుణబాకీలు లేనివారికే వాలెట్ లోన్ అందిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పేటీఎమ్ మాత్రం తాను కొత్తగా ఏర్పాటు చేయబోతున్న బ్యాంకుల్లో ఖాతా తెరిచినవారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని తెలిపింది.

ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్న కారణంగా వాలెట్ రుణాలు అందించేముందు కంపెనీలు కఠినతరమైన నిబంధనలను పాటించనున్నట్లు తెలిపాయి. కాగా, టెక్ సైన్స్ రీసెర్చ్ అనే కన్సల్టెన్సీ తాజాగా చేసిన పరిశోధనలో 2020 కల్లా మొబైల్ మార్కెట్ 6.6 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు 145 బ్యాంకులకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం కల్పించింది.

మరిన్ని వార్తలు