జర్మనీ కంపెనీకి మరోసారి భారీ షాక్!

12 Dec, 2016 14:41 IST|Sakshi
జర్మనీ కంపెనీకి మరోసారి భారీ షాక్!

సియోల్: జర్మనీ కార్ల తయారీ దిగ్గజ కంపెనీ ఫోక్స్వాగన్ కు దక్షిణ కొరియా భారీ షాకిచ్చింది. కర్బన ఉద్గారాల స్కాం అనంతరం కంపెనీ పడరాని పాట్లు పడింది. పలు దేశాల్లో ఈ కంపెనీకి భారీ నష్టాలు ఎదురుకాగా, దక్షిణకొరియాలో కంపెనీకి చెందిన 80 శాతం మోడల్ కార్ల అమ్మకాలను గత ఆగస్టులో నిషేధించింది. పొంతనలేని ప్రకటనలతో మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ 32 అమెరికన్ మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు 216 కోట్ల రూపాయాలు) పరిహారం చెల్లించాలని కంపెనీ కొరియా యూనిట్‌కు సియోల్ యాంటీ ట్రస్ట్ ఏజెన్సీ ఆదేశించింది.

కర్భన ఉద్గారాలు చాలా తక్కువ మోతాదులో విడుదలవుతాయని ఫోక్స్ వాగన్ కార్ల సంస్థ ప్రకటనలిచ్చిందని, మైలేజ్ విషయంలో మోసానికి పాల్పడిందని ఫెయిర్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ) పేర్కొంది. దక్షిణకొరియా యూనిట్ మాజీ చీఫ్ టెరెన్స్ బ్రైస్ జాన్సన్‌ను ఎఫ్‌టీసీ విచారించింది. ఐదుగురు ఉన్నతాధికారులతో పాటు దక్షిణకొరియా విభాగం కంపెనీ మాజీ చీఫ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నట్లు వివరించింది. ఇప్పటికే ఫోక్స్ వాగన్ కార్ల అమ్మకాలు అక్కడ 33శాతం తగ్గిపోగా, తాజాగా సియోల్ యాంటీ ట్రస్ట్ ఏజెన్సీ భారీ మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు