మూడీస్‌ దారిలో వెళ్లని ఎస్‌ అండ్‌ పీ!

25 Nov, 2017 02:23 IST|Sakshi

ఇండియాకు పాత రేటింగే కొనసాగింపు

అవుట్‌లుక్‌తో ‘బీబీబీ– మైనస్‌ యథాతథం

తక్కువ తలసరి ఆదాయం, అధిక రుణాలున్నా...

వచ్చే రెండేళ్లూ వృద్ధికి ఢోకా ఉండదని విశ్లేషణ

 

న్యూఢిల్లీ: మూడీస్‌ సంస్థ రేటింగ్‌ పెంచటంతో మంచి జోష్‌ మీదున్న ప్రభుత్వ వర్గాలను... మరో అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ (ఎస్‌ అండ్‌ పీ) మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం భారత్‌కు ఇస్తున్న రేటు ‘బీబీబీ–మైనస్‌ను’ స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ఇదే విధంగా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ‘స్టేబుల్‌ అవుట్‌లుక్‌’ అనేది భారత పటిష్ట వృద్ధికి సంకేతమని వివరించింది. పటిష్ట వృద్ధి ధోరణి రెండేళ్లు కొనసాగుతుందని కూడా ఎస్‌ అండ్‌ పీ అంచనావేసింది. అతి తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వానికున్న భారీ రుణం ప్రాతిపదికన యథాతథ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సూచించింది. 

ఎస్‌అండ్‌పీ ప్రకటన చెబుతోంది ఇదీ.

► భారత్‌ కరెంట్‌ అకౌంట్, ద్రవ్యోలోటు పరిస్థితులు అంచనాలకు అనుగుణంగా కొనసాగవచ్చు

► ద్రవ్యపరమైన విశ్వసనీయత మెరుగుపడుతోంది. 

► దేశంలో తక్కువ తలసరి ఆదాయం ఉంది. ప్రభుత్వంపై భారీ అంతర్జాతీయ రుణ భారమూ ఉంది. అయితే ఇక్కడ భారత్‌లో పటిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ ఉంది. ఈ అంశాలు విధానపరమైన పటిష్టతను పెంపొందిస్తాయి. ఇవన్నీ ప్రస్తుత రేటింగ్‌కు పూర్తి మద్దతుగా ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రతికూలాంశాలు ఉన్నప్పటికీ, తరువాత పేర్కొన్న సానుకూల అంశాలు ఆర్థిక వ్యవస్థకు తగిన సమతౌల్యతను అందిస్తూ, వృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నాం. 

► 2007 వరకూ ఎస్‌అండ్‌పీ భారత్‌ రేటింగ్‌ ‘బీబీబీ మైనస్‌’గా ఉండేది. ఇది అతి దిగువ స్థాయి గ్రేడ్‌. ఈ రేటింగ్‌కు ఎస్‌అండ్‌పీ 2007 జనవరిలో ‘స్టేబుల్‌ అవుట్‌లుక్‌’ను చేర్చింది. 2009లో అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’కు మార్చిన సంస్థ, మళ్లీ 2010లో స్టేబుల్‌ హోదా ఇచ్చింది. 2012లో మళ్లీ నెగటివ్‌ అవుట్‌లుక్‌కు మార్చిన ఎస్‌అండ్‌పీ...  మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టాక మళ్లీ ‘స్టేబుల్‌’ అవుట్‌లుక్‌ను ఇచ్చింది. ఇదే రేటింగ్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. 

► ప్రభుత్వ వర్గాల నిరాశ: ఎస్‌అండ్‌పీ తాజా నిర్ణయంపై ప్రభుత్వ వర్గాలు నిరాశ వ్యక్తం చేశాయి. ఇది తగిన నిర్ణయం కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే  వచ్చే ఏడాది రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ అవుతుందన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు