క్లిక్‌ దూరంలో సరుకు రవాణా..

20 Jan, 2017 01:17 IST|Sakshi
క్లిక్‌ దూరంలో సరుకు రవాణా..

దేశంలో విస్తరిస్తున్న అగ్రిగేటర్లు
తక్కువ రేట్లకే రవాణా సేవలు
వ్యవస్థీకృతం అవుతున్న పరిశ్రమ  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తను విక్రయించే వస్తువుల్లో దేన్నీ తను తయారు చేయదు. అలా తయారుచేసి... విక్రయించేవాళ్లందరినీ కలుపుతుంది.

క్యాబ్‌ రవాణా సంస్థ ఉబెర్‌కు... సొంత కార్లేమీ లేవు. కార్లుండి వాటిని ట్యాక్సీలుగా నడిపేవారిని, డ్రైవర్లచేత నడిపించే వారిని టెక్నాలజీతో కలుపుతుంది.

ఇవేకాదు. రియల్‌ ఎస్టేట్, ఆరోగ్య పరీక్షలు, వార్తలు, రవాణా... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా అగ్రిగేటర్ల ఆధిపత్యమే కనిపిస్తుంది. అవసరం ఉన్నవాళ్లని... ఆ అవసరం తీర్చేవాళ్లని కలిపేవే ఈ అగ్రిగేటర్లు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది అగ్రిగేటర్ల రాజ్యం. వాటి దగ్గర భౌతిక ఆస్తులుండవు. టెక్నాలజీ మాత్రమే ఉంటుంది. ఇపుడు సరకు రవాణాలో ఈ ట్రెండ్‌ బాగా పెరుగుతోంది.

దేశంలో సరకు రవాణా రంగంలో ఏటా రూ.6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. వీటిలో టాప్‌–10 ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీల వాటా 2 శాతంలోపే. చాలావరకూ అవ్యవస్థీకృతంగానే ఉండటంతో మధ్యవర్తులదే రాజ్యం. పైపెచ్చు లావాదేవీలన్నీ నగదు రూపంలోనే. వాహనంపై యజమానికి నియంత్రణ ఉండటం లేక డ్రైవర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. సరుకు క్షేమంగా గమ్యం చేరడం ఒక ఎత్తైతే.. రవాణా డబ్బులు చేతికందే వరకు సగటు యజమానుల తిప్పలు అన్నీఇన్నీ కావు. ఈ మధ్యవర్తులకు అడ్డుకట్ట వేసి... అంతా పారదర్శకంగా నిర్వహించటానికి టెక్నాలజీ ఆసరాగా అగ్రిగేటర్లు రంగంలోకి దిగుతున్నారు. పెద్ద పెద్ద సంస్థలతో పాటు కార్పొరేట్‌ దిగ్గజాలూ పెట్టుబడులు పెడుతున్నారు.

ఈ అగ్రిగేటర్లు ఏం చేస్తాయంటే...
ఫోర్టిగో, ట్రక్‌ సువిధ, ట్రక్‌ మండి, ఫ్రెయిట్‌ బజార్, స్మార్ట్‌షిఫ్ట్, ఆటో లోడ్, ఫ్రెయిట్‌ టైగర్, మూవో, ట్రక్కీ, బ్లాక్‌బక్, గోగో ట్రక్, కార్గో ఎక్సే్చంజ్, రిటర్న్‌ట్రక్స్‌.కామ్‌ వంటివన్నీ సరకు రవాణా ఆగ్రిగేటర్లే. ఒక్కొక్కరిదీ ఒకో వ్యూహం. వాహనంలో పూర్తిగా సరుకు నింపకపోయినా... ఇతర కస్టమర్ల సరుకుల్ని కూడా కలిపి రవాణా చేస్తుంటాయివి. వీటిని ఆశ్రయించిన వినియోగదారులకు 10–20 శాతం తక్కువ ధరకే సేవలందుతున్నాయి. సాధారణంగా ఆఫ్‌లైన్‌లో వాహన యజమానులు రానూపోనూ ఛార్జీల్ని ఒకేసారి వసూలు చేస్తుంటారు. అగ్రిగేటర్ల రాకతో ఆ పరిస్థితి లేదు. ఒకవైపుకే వసూలు చేస్తున్నారు కూడా.

వాహనం ఎటు వెళుతోందో తెలుసుకునేందుకు జీపీఎస్‌... రియల్‌ టైమ్‌ ఇన్వాయిస్‌... శిక్షణ పొందిన డ్రైవర్లు ఇలా పలు సంస్థలు ప్రత్యేకమైన సేవలందిస్తున్నాయి. వాహన యజమానులకు రుణాలూ ఇప్పిస్తున్నాయి. వాహనం దారి మధ్యలో నిలిచిపోతే వెంటనే మరో వాహనంలో సరుకును తరలించటం కూడా చేస్తున్నారు. ‘‘సరుకు రవాణాలో వచ్చే మూడేళ్లలో మెజారిటీ వాటా వ్యవస్థీకృతమవుతుంది’’ అని ఫోర్టిగో సహ వ్యవస్థాపకులు వివేక్‌ మల్హోత్రా ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. తాము పూర్తిగా క్యాష్‌లెస్‌ లావాదేవీలే చేస్తున్నామన్నారు. ‘‘వాహనాల ట్రాకింగ్‌ ఉండాలని మా కస్టమర్లు అడుగుతున్నారు. గ్యారం టీ చెల్లింపులు, రవాణాకు హామీ ఉంటోంది కనక మాతో ట్రాన్స్‌పోర్టర్లు చేతులు కలుపుతున్నారు’’ అని వివరించారాయన.

పనితీరులో పారదర్శకత...
సరుకు రవాణా చేయదల్చుకున్నవారు అగ్రిగేటర్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో సమాచారాన్ని పోస్ట్‌ చేయాలి. సరుకు రకం, బరువు, దూరాన్నిబట్టి వాహన యజమానులు చార్జీ చెబుతారు. ఇద్దరికీ సమ్మతమైతే డీల్‌ కుదురుతుంది. అగ్రిగేటర్లు వాహన యజమాని నుంచిగానీ, కస్టమర్‌ నుంచి గానీ... కొందరైతే ఇద్దరి నుంచీ కొంత కమిషన్‌ వసూలు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం వాహనాలు రోడ్డెక్కుతాయి కనక అదనపు ట్రిప్పులకు ఆస్కారముంటుంది. ‘సరుకు రవాణాకు ఎక్కువ ధర చెల్లిస్తున్న కస్టమర్లూ ఉన్నారు. డిమాండ్‌ ఎక్కడ ఉందో తెలియక వాహనాలు ఖాళీగా ఉండే సందర్భాలూ ఉన్నాయి. వ్యాపారులను, వాహన యజమానులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాం’ అని స్మార్ట్‌షిఫ్ట్‌ సీఈవో కౌసల్య నందకుమార్‌ తెలిపారు. వాహన యజమానుల ఆదాయం భారీగా పెరిగింది. లెండింగ్‌కార్ట్‌ ద్వారా వారికి రుణం ఇప్పిస్తున్నామని చెప్పారు. మహీంద్రా గ్రూప్‌ స్మార్ట్‌షిఫ్ట్‌ సీడ్‌ ఇన్వెస్టర్‌గా ఉందన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న ట్రక్కులు : 25 లక్షలు
1–5 ట్రక్కులున్నవారు : 80 శాతం
20 కన్నా ఎక్కువ ట్రక్కులున్న వారు : 10 శాతం
5– 20 ట్రక్కులున్న వారు : 10 శాతం
తేలికపాటి రవాణా వాహనాలు : 20 లక్షలపైనే

మరిన్ని వార్తలు