ఏరోస్పేస్‌కు ప్రత్యేక పారిశ్రామిక విధానం

6 Nov, 2014 00:22 IST|Sakshi
ఏరోస్పేస్‌కు ప్రత్యేక పారిశ్రామిక విధానం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భౌగోళికంగా, ప్రకృతిపరంగా భారత్‌లో ఏ నగరంలో లేని ప్రత్యేకతల కలబోత హైదరాబాద్. డీఆర్‌డీఎల్, బీడీఎల్ వంటి సంస్థలు భాగ్యనగరానికి ప్రధాన బలం. ఈ నేపథ్యంలోనే విదేశీ దిగ్గజ సంస్థలు ఇక్కడ అడుగుపెట్టాయి. టాటా కంపెనీ ప్రత్యేకంగా దృష్టిసారించింది కూడా. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతానికి చేరడంతో ఈ రంగంలో అనూహ్య మార్పులుంటాయి.

 హైదరాబాద్ కంపెనీలకు కలిసిరానుంది. ఈ నెలలో జరగనున్న సదస్సు వేదికగా తెలంగాణలో ఉన్న అవకాశాలను సీఎం కె.చంద్రశేఖరరావు స్వయంగా వివరిస్తారు. ఏరోస్పేస్ పార్కులను కొత్తగా ఇబ్రహీంపట్నం, శామీర్‌పేట సమీపంలో ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో హబ్‌గా ఎదగడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయి.

 ఏరోస్పేస్‌కు ప్రత్యేకంగా..
 మంగళ్‌యాన్‌తోపాటు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో హైదరాబాద్ కంపెనీలు పాలు పంచుకున్నాయి. డిఫెన్స్, ఏరోస్పేస్‌కు అనుబంధంగా ఉన్న కంపెనీల్లో 30 వేల మందికిపైగా పనిచేస్తున్నారు. ఈ కంపెనీలను మరింత ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అలాగే అద్భుత ఫలితాలను సృష్టించొచ్చన్నది సీఎం  కేసీఆర్ ఆలోచన. అందుకే ఏరోస్పేస్‌కు ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకు వస్తున్నాం. ఇందుకోసం డీఆర్‌డీవో మాజీ చీఫ్ వి.కె.సారస్వత్ సహకారం తీసుకుంటాం.

 కంపెనీలకు ఫండింగ్ సమస్యే కాదు. వాటికి కావాల్సింది ప్రభుత్వ ప్రోత్సాహం. కేంద్ర ప్రభుత్వం కూడా పరిశ్రమలకు ఊతమిచ్చేలా చొరవ తీసుకుంటోంది. ఇక మా నుంచి కంపెనీలకు పూర్తి మద్దతు ఉంటుంది. పార్కుల ఏర్పాటుకు ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చినా భుజం తడతాం. రాష్ట్రానికి మంచి జరిగే ఏ కార్యక్రమమైనా, ఎటువంటి ప్రోత్సాహాలైనా ఇచ్చేందుకు వెనుకాడం.

 దిగ్గజ కంపెనీల రాక..
 ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీ ముందుకొచ్చింది. ఎయిర్‌స్ట్రిప్ కావాలని ఆ కంపెనీ కోరింది. అవసరమైతే నగరం వెలుపల ఎయిర్‌స్ట్రిప్ నిర్మించి ఇస్తాం. అలాగే ఏరోస్పేస్ యూనివర్సిటీ స్థాపించేం దుకు విదేశీ సంస్థ ఒకటి ప్రతిపాదించింది. ఎయిర్‌క్రాఫ్ట్ తయారీలో ఉన్న అమెరికా కంపెనీ ప్రాట్ అండ్ విట్నీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.

భారత్‌కు చెందిన పెద్ద గ్రూప్ కంపెనీలు సైతం భాగ్యనగరంలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాయి. అధికార బృందం త్వరలో ముంబై వెళ్లి ఆ కంపెనీలతో చర్చలు జరపనుంది. తెలంగాణ పారిశ్రామిక విధా నం తుది దశలో ఉంది. రంగాల వారీగా ప్రత్యేక పారిశ్రామిక పాలసీలు తీసుకొస్తున్నాం.

 పునర్‌వైభవం త్వరలో..
 రియల్టీ రంగంలో అనిశ్చితి తాత్కాలికమే. పారిశ్రామిక విధానం వస్తే పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. ఇతర నగరాలతో పోలిస్తే పెట్టుబడిపై రాబడి భాగ్యనగరంలో ఆకర్షణీయంగా ఉంటుంది. తెలంగాణలో స్థిర ప్రభుత్వం వచ్చింది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రివన్నీ వేగవంతమైన నిర్ణయాలే.

లాభాపేక్ష లేకుండా, లంచాలకు దూరంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇక ఎకానమీ గాడిన పడుతున్న సంకేతాలున్నాయి. నిపుణులైన మానవ వనరులు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ముత్యాల నగరం సొంతం. తిరిగి హైదరాబాద్ రియల్టీకి పునర్‌వైభవం ఖాయం. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఐటీఐఆర్‌ను 5 క్లస్టర్లుగా నగరం అన్ని వైపులా విస్తరిస్తున్నాం. ఏ మూల నుంచైనా శంషాబాద్‌కు గంటలోగా చేరుకునేలా రోడ్లను అభివృద్ధి పరుస్తున్నాం.
 

మరిన్ని వార్తలు