చిన్న బ్యాంకులకు డిపాజిట్‌ బూస్ట్‌

22 Dec, 2016 01:05 IST|Sakshi
చిన్న బ్యాంకులకు డిపాజిట్‌ బూస్ట్‌

బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఐవో సంపత్‌ రెడ్డి
డీమోనిటైజేషన్‌తో స్థూల ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో ప్రయోజనం
వచ్చే ఏడాది ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పావు శాతం తగ్గించవచ్చు
మెరుగ్గా మెటల్స్, హెల్త్‌కేర్, ఐటీ రంగాలు


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
పెద్ద నోట్ల రద్దు అంశం స్థూలంగా ఆర్థిక వృద్ధికి దోహదపడగలదని అంటున్నారు బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఐవో సంపత్‌ రెడ్డి. డీమోనిటైజేషన్‌తో చిన్న బ్యాంకులకు డిపాజిట్లపరంగా లబ్ధి చేకూరగలదని సాక్షిబిజినెస్‌ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వూ్యలో వివరించారాయన. పాలసీ రేట్ల పెంపు విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్న ఆర్‌బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పావు శాతం మేర పెంచే అవకాశాలు ఉన్నాయనిచెప్పారు. ఇంటర్వ్యూ వివరాలు మరిన్ని..

మార్కెట్‌ సెంటిమెంటుపై డీమోనిటైజేషన్‌ ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి?
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏకంగా రూ. 14 లక్షల కోట్ల మేర కరెన్సీని రీప్లేస్‌ చేయడమనేది చాలా పెద్ద కార్యక్రమమే. వినియోగదారుల విచక్షణాయుత కొనుగోళ్లపై డీమోనిటైజేషన్‌ ప్రతికూల ప్రభావం కచ్చితంగాఉంటుంది. రియల్‌ స్టేట్, జ్యుయలరీ రంగాలపై కూడా పడుతుంది. అయితే, తక్కువ వ్యయాలతో కరెంటు, సేవింగ్స్‌ ఖాతాల డిపాజిట్లు పెరగడం వల్ల బ్యాంకులు.. అందునా చిన్న బ్యాంకులపై సానుకూల ప్రభావంఉండగలదు. ఇప్పటిదాకా అనధికారికంగా చలామణీ అవుతున్న నగదులో ఎంతో కొంత భాగం అధికారికంగా ఎకానమీలోకి చలామణీలోకి రావడం వల్ల పన్నులపరంగా ప్రభుత్వ ఆదాయాలూ పెరగగలవు. వృద్ధిపైప్రతికూల ప్రభావం స్వల్పకాలికంగానే ఉండొచ్చు.  మరింత కొత్త కరెన్సీ వ్యవస్థలోకి  రావడంతో పాటు నగదు లావాదేవీలకు బదులుగా ప్రజలు డిజిటల్‌ చెల్లింపుల వైపు మళ్లే కొద్దీ.. ఆర్థిక వృద్ధి కూడా మెరుగుపడగలదని అంచనా.

ఈక్విటీ మార్కెట్లపై ఏయే అంశాలు ప్రభావం చూపనున్నాయి?
ఇటీవల కొన్నాళ్లుగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు దీనికి కారణమవుతున్నాయి. బ్రెగ్జిట్‌ ఓటు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పెద్ద నోట్ల రద్దుతదితర అనూహ్య పరిణామాలు ఎదురైనప్పటికీ.. మార్కెట్లు నిలదొక్కుకోగలిగాయి. డీమోనిటైజేషన్‌ ప్రభావాలపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. ఇవి కొన్ని నెలలకు మాత్రమే పరిమితం కావొచ్చు. ప్రభుత్వపరమైనసంస్కరణలు, ఇతరత్రా చర్యలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు, తదితర అంశాలను మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తుంటాయి. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) అమల్లో జాప్యం జరిగితే మార్కెట్లకు నిరాశ కలగొచ్చు. అమెరికాకొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ అవలంబించబోయే విధానాలు.. జర్మనీ, ఫ్రాన్స్‌లో జరగబోయే ఎన్నికలు మొదలైన అంతర్జాతీయ పరిణామాలపైనా మార్కెట్ల కదలికలు ఆధారపడి ఉంటాయి.

ఆర్‌బీఐ పాలసీ రేట్లను యథాతథంగా ఉంచడం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉండొచ్చు?
వివిధ అంశాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని వేచి, చూసే ధోరణి అవలంబించడం ద్వారా ఆర్‌బీఐ వివేకవంతంగా వ్యవహరించిందనే అనుకోవచ్చు. కీలకమైన వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణ కట్టడిపైనే ప్రధానంగాదృష్టి పెట్టినట్లు ఆర్‌బీఐ ఈసారి పరపతి విధాన సమీక్షలో పేర్కొంది. ఆర్‌బీఐ ఉదార ద్రవ్య విధానాన్ని కొనసాగిస్తూ.. రాబోయే రోజుల్లో అందుబాటులోకి వచ్చే గణాంకాలను బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 25 బేసిస్‌ పాయింట్ల మేర రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు తగ్గించవచ్చని భావిస్తున్నాం.

వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో జీవిత బీమా రంగంపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
వడ్డీ రేట్లు తగ్గుతున్న కొద్దీ బీమా రంగ సంస్థలు మెరుగైన రాబడుల కోసం ఇన్వెస్ట్‌ చేసే సాధనాలు తగ్గొచ్చు. మా మటుకు మేము పాలసీదారులకు గణనీయంగా రాబడులు అందించేలా తగు రీతిలో అసెట్స్‌కేటాయింపులు జరుపుతుంటాం. అలాగే రిస్కులు, రాబడుల అంచనాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగు మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుత స్థాయిల్లో కూడా భారత్‌లో వడ్డీ రేట్లు మెరుగ్గానేఉన్నాయి. రాబడులను మెరుపర్చుకునేందుకు ఈక్విటీల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నాం. బీమా రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావాల విషయానికొస్తే.. డీమోనిటైజేషన్‌ వల్ల నల్లధనం తగ్గి, పన్ను వసూళ్లు .. డిజిటల్‌ లావాదేవీలు పెరగడం మొదలైనవి దీర్ఘకాలికంగా సానుకూలంగానే ఉండగలవు.

ఈ ఆర్థిక సంవత్సర వృద్ధిపై మీ అంచనాలేమిటి?
ప్రథమార్ధంలో మెరుగైన వర్షపాతం, వినియోగదారుల డిమాండ్‌ పెరుగుదల వంటి అంశాలతో వృద్ధి గతి సానుకూలంగా కనిపించినప్పటికీ.. డీమోనిటైజేషన్‌ కారణంగా ప్రతికూల ప్రభావం పడింది. కాబట్టి దీర్ఘకాలికంగాడీమోనిటైజేషన్‌ సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. తాజాగా మూడో త్రైమాసికంలో సంస్థల ఆదాయాల వృద్ధి దెబ్బతినొచ్చు. 2017–18 తొలి తైమాసికం నుంచి మాత్రమే ఆదాయాలు మెరుగుపడొచ్చని అంచనా.

ఏయే రంగాలు ఆశావహంగా ఉన్నాయి?
బలహీన రూపాయి కారణంగా మెటల్స్, ఐటీ, హెల్త్‌కేర్‌ రంగాలు బాగుండొచ్చని అంచనా వేస్తున్నాం. అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వల్ల కమోడిటీల ధరలు పెరగొచ్చు. ఇది మెటల్స్‌ రంగానికిసానుకూలం. ఇక డీమోనిటైజేషన్‌ మూలంగా ప్రైవేట్‌ బ్యాంకుల్లో (ముఖ్యంగా చిన్న ప్రైవేట్‌ బ్యాంకులు) డిపాజిట్లు పెరగడం వాటికి సానుకూలాంశం. దీనివల్ల ప్రైవేట్‌ బ్యాంకుల అసెట్‌ క్వాలిటీ కూడా బాగుంటుంది.అందరికీ గృహాలు సమకూర్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన పథకంతో సిమెంట్‌ రంగం మెరుగ్గా ఉండొచ్చు. రాబోయే అనేక ఏళ్లపాటు భారత్‌ వృద్ధి అధిక స్థాయిలోనే ఉండనుంది. కాబట్టి రిటైల్‌ ఇన్వెస్టర్లు దీర్ఘకాలికప్రాతిపదికన డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో ద్వారా మెరుగైన రాబడులు అందుకునే ప్రయత్నం చేయొచ్చు. మార్కెట్లు కరెక్షన్‌లకు లోనయ్యే సందర్భాలను ఈక్విటీలకు మరింతగా కేటాయించేందుకు ఉపయోగించుకోవచ్చు.

>
మరిన్ని వార్తలు