కొత్త ఆర్డినెన్స్ : విజయ్‌ మాల్యాకు సమన్లు

30 Jun, 2018 17:14 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రభుత్వ బ్యాంకులకు భారీ రుణ ఎగవేత దారుడు, పారిశ్రామికవేత్త  విజయ్‌ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.  ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు తాజాగా మాల్యాకు సమన్లు జారీ చేసింది.  భారీగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరస్తులపై కొరడా ఝుళిపించేందుకు  కొత్తగా ప్రకటించిన ఆర్డినెన్స్ కింద ఆగష్టు 27న, లేదా అంతకుముందు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. లేదంటే  ‘పరారీలో ఉన్న నేరస్థుడి’గా ప్రకటించడంతోపాటు మాల్యాకు చెందిన రూ. 12,500కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్నబ్యాంకు బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాననీ, ఇందుకు  బ్యాంక్ ఆఫ్ కన్సార్షియంతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు  మాల్యా సంసిద్ధత వ్యక‍్తం చేసిన సందర్భంలో సమన్లు జారీ చేయడం విశేషం.

ఈ ఏడాది ప్రారంభంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరస్థుల ఆర్డినెన్స్ ప్రకారం  రుణదాతల  "అన్ని లింక్డ్ ఆస్తులను" స్వాధీనం చేసుకోవడానికి  అనుమతి లభిస్తుంది. దేశంలో ఈ ఆర్డినెన్స్‌ తరువాత  ఈడీ  తీసుకున్న మొదటి కేసు.. మొదటి చర్య మాల్యాపైనే.  ఈ క్రమంలో బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితులు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, గీతాంజలి జెమ్స్‌ అధిపతి మెహుల్‌ చోక్సీ పై చర్యలకు ఈడీ సిద్ధం కానుంది.

మరోవైపు మాల్యా బేరానికి దిగొచ్చారన్న వార్తలపై మాల్యా నేడు(శనివారం) స్పందించారు. తనది బేరమైతే..ఈడీ అధికారులు కూడా అదే సిద్ధాంతాన్ని అనుసరించాలంటూ సెటైర్‌ వేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో ఈడీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను బేరసారాలకు ప్రయత్నిస్తున్నానని చెప్పిన ఈడీ అధికారులు ముందు ఈడీ ఛార్జ్‌షీట్‌ చదవాలని సలహా యిచ్చారు. అదే నిజమైతే ఈడీ అధికారులుకూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి.. ఎక్కడైతే తనఆస్తులు ఉన్నాయో ఆ కోర్టుల్లో ఇలాంటి బేరసారాల ఒప్పందానికి రావాలని ఆహ్వానిస్తున్నానంటూ  మాల్యా ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు