రూ. 65 వేల కోట్లకు స్పెక్ట్రం బిడ్లు

6 Mar, 2015 01:33 IST|Sakshi
రూ. 65 వేల కోట్లకు స్పెక్ట్రం బిడ్లు

ముంబై: టెలికం స్పెక్ట్రం వేలం రెండో రోజున బిడ్ల విలువ రూ. 65,000 కోట్లకు చేరింది. గురువారం 5 రౌండ్లు జరిగాయి. దీంతో మొత్తం 11 రౌండ్లు జరిగినట్లయింది. హోలీ సందర్భంగా సెలవుదినం అయినప్పటికీ నేడు (శుక్రవారం) కూడా వేలం కొనసాగనుంది. 2జీ, 3జీ సేవలకు ఉపయోగపడే నాలుగు బ్యాండ్‌విడ్త్‌లలో సుమారు 386 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను టెలికం శాఖ వేలం వేస్తోంది. తొలి రోజున రూ. 60,000 కోట్ల మేర బిడ్లు వచ్చాయి. ఈ వేలం ద్వారా రూ. 82,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల దాకా ప్రభుత్వ ఖజానాకు రాగలవని అంచనా.

మరోవైపు, టెలికం కంపెనీలు తీవ్రంగా పోటీపడుతుండటం వల్ల స్పెక్ట్రం ధర గణనీయంగా పెరగొచ్చని, దీని వల్ల టారిఫ్‌లు కూడా భారీగానే పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్‌అండ్‌పీ) తెలిపింది. అలాగే పెద్ద ఆపరేటర్లు, చిన్న ఆపరేటర్ల మధ్య వ్యత్యాసం కూడా గణనీయం గా పెరుగుతుందని పేర్కొంది. మరోవైపు, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ రేట్లు తగ్గిస్తుండటం, టెలికం మార్కెట్లోకి కొత్తగా రిలయన్స్ జియో ప్రవేశం మొదలైన కారణాలతో డేటా విభాగంలో పోటీ తీవ్రతరమవుతుందని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు