రెండేళ్లలో కొత్తగా 3 వేల మంది

28 Jan, 2016 01:02 IST|Sakshi
రెండేళ్లలో కొత్తగా 3 వేల మంది

దేశవ్యాప్తంగా స్పీచ్ రికగ్నిషన్ సేవల్లో విస్తరణ: నుయాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాయిస్, లాంగ్వేజ్ సొల్యూషన్స్ అందిస్తున్న అమెరికాకు చెందిన నుయాన్స్ కమ్యూనికేషన్స్ వచ్చే రెండేళ్లలో భారత్‌లో 3,000 మంది మెడికల్ లాంగ్వేజ్ స్పెషలిస్టులను (ట్రాన్‌స్క్రిప్షనిస్ట్) నియమించనుంది. నాస్‌డాక్‌లో లిస్టయిన ఈ కంపెనీకి హైదరాబాద్‌లోని 400 మంది సిబ్బందితో సహా భారత్‌లో అయిదు నగరాల్లోని కార్యాలయాల్లో 4,000 మంది ఉద్యోగులున్నారు.

నుయాన్స్ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సెంటర్‌కు కొత్తగా 200 మందిని నియమించుకోనున్నట్టు కంపెనీ హెల్త్ విభాగం గ్లోబల్ హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ టించ్ తెలిపారు. మాటలను గుర్తించే (స్పీచ్ రికగ్నిషన్) టెక్నాలజీ ఉత్పత్తులతో దేశంలో విస్తరించనున్నట్టు చెప్పారు. గత రెండేళ్లలో కంపెనీ భారత్‌లో రూ.45 కోట్ల దాకా వెచ్చించింది. కాగా ఇప్పుడిప్పుడే దేశంలోని ఆసుపత్రులు మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ సేవలను వినియోగిస్తున్నట్లు నుయాన్స్ ఇండియా హెచ్‌ఆర్ హెడ్ సౌమిత్ర కుమార్ దాస్ తెలియజేశారు.

‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్యులు తమవద్దకు వచ్చిన రోగి వివరాలు, వారికున్న సమస్య, చేయాల్సిన చికిత్స వంటివి వాయిస్ రికార్డ్ చేస్తారు. ఈ వాయిస్ రికార్డులను మెడికల్ ట్రాన్‌స్క్రిప్షన్ సేవలందించే కంపెనీకి ఆసుపత్రులు పంపిస్తాయి. వైద్యుడు మాట్లాడిన ప్రతి మాటను ట్రాన్‌స్క్రిప్షనిస్టులు హెడ్‌ఫోన్లలో విని డిజిటల్ డాక్యుమెంట్లుగా అక్షర రూపం కల్పిస్తారు. ఈ డాక్యుమెంట్లను తిరిగి సంబంధిత ఆసుపత్రికి పంపిస్తారు. పత్రాలు డిజిటల్ రూపంలో ఉంటాయి కాబట్టి ఎక్కడైనా, ఏ సమయంలోనైనా వాడుకోవచ్చు’’ అని ఆయన వివరించారు. స్పీచ్ రికగ్నిషన్‌లో తాము అందించే సేవలు మెడికల్ ట్రాన్స్‌క్రిప్షనిస్టులకు బాగా ఉపయోగపడతాయన్నారు.

మరిన్ని వార్తలు