స్పైస్‌జెట్‌ కొత్తగా 14 విమానాలు, బుకింగ్స్‌ ఓపెన్‌

18 Jun, 2018 20:30 IST|Sakshi

న్యూఢిల్లీ : బడ్జెట్‌ ప్యాసెంజర్‌ క్యారియర్‌ స్పైస్‌జెట్‌ కొత్తగా 14 దేశీయ విమానాలను ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ కొత్త విమానాలు తిరగనున్నాయని పేర్కొంది. డైరెక్ట్‌ కనెక్టివిటీని పెంచడానికి, నాన్‌-మెట్రోలు, చిన్న నగరాల్లో విమాన సర్వీసులను అందజేయడానికి ఈ కొత్త విమానాలను స్పైస్‌జెట్‌ ప్రవేశపెట్టింది. ఈ కొత్త విమానాలతో సౌత్‌, వెస్ట్‌ ఇండియాలో తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకోనున్నట్టు పేర్కొంది. పుణే-పాట్నా, చెన్నై-రాజమండ్రి, హైదరాబాద్‌-కాలికట్‌, బెంగళూరు-తూత్‌కుడి సెక్టార్లలో ఈ కొత​ విమానాలను ప్రవేశపెడుతోంది. అదనంగా ఢిల్లీ-పాట్నా(రెండో ఫ్రీక్వెన్సీ), బెంగళూరు-రాజమండ్రి(రెండో ఫ్రీక్వెన్సీ), ముంబై-బెంగళూరు(ఐదో ఫ్రీక్వెన్సీ) సెక్టార్‌లలో కూడా ఆపరేషన్లను కొనసాగించనుంది. తమ కొత్త బోయింగ్‌ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌, క్యూ400 రీజనల్‌ టర్బోప్రూప్స్‌తో తమ సర్వీసులను వేగవంతంగా విస్తరించనున్నామని స్పైస్‌జెట్‌ చీఫ్‌ సేల్స్‌, రెవెన్యూ ఆఫీసర్‌ శిల్పా భటియా చెప్పారు.  

ఢిల్లీ-పాట్నా, ముంబై-బెంగళూరు, చెన్నై-రాజమండ్రి సెక్టార్లలో ప్రవేశపెట్టిన విమానాలు రోజువారీ నడవనున్నాయి. అదేవిధంగా హైదరాబాద్‌-కాలికట్‌, బెంగళూరు-తూత్‌కుడి, బెంగళూరు-రాజమండ్రి రూట్లలో నడిచే విమానాలు మంగళవారాలు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నడుస్తాయి. పాట్నా-పుణే మధ్యలో నడిచే విమానాలు శనివారం మినహాయించి, మిగిలిన అన్ని రోజుల్లో తన కార్యకలాపాలను సాగిస్తాయి. రాజమండ్రి, పాట్నా, తూత్‌కుడి, కాలికట్‌ వంటి చిన్న నగరాల ప్రజలు కూడా ఇక నుంచి చాలా తేలికగా ప్రయాణించనున్నారు. స్పైస్‌జెట్‌ అధికారిక వెబ్‌సైట్‌-స్పైస్‌జెట్‌.కామ్‌, యాప్‌లలో కూడా ఈ విమాన టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఇటీవలే స్పైస్‌జెట్‌ తూత్‌కుడి నుంచి బెంగళూరుకు డైరెక్ట్‌ ఫ్లైట్‌ ప్రారంభించింది.

మరిన్ని వార్తలు