ఆ ఉద్యోగులను ఆదుకుంటాం..

19 Apr, 2019 20:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సమస్యలతో మూసివేత అంచున నిలిచి ఉద్యోగాలు కోల్పోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు తమ సంస్థలో అవకాశం ఇస్తామని స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. తాము విస్తరణ ప్రణాళికలతో ముందుకెళుతున్న క్రమంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ మూసివేత కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాము తొలుత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

తామిప్పటికే 100 మందికి పైగా పైలట్లు, 200 మంది క్యాబిన్‌ సిబ్బంది, 200 మందికి పైగా సాంకేతిక, విమాన సిబ్బందికి ఉద్యోగాలు ఇచ్చామని సింగ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాము తమ విమాన సేవలను మరింత విస్తరిస్తామని, మరింత మంది జెట్‌ ఉద్యోగులకు అవకాశం ఇస్తామని చెప్పారు. ప్రయాణీకులకు అసౌకర్యాన్ని నివారించేందుకు అన్ని చర్యలూ చేపడతామని తెలిపారు.

మరోవైపు ఎయిర్‌ ఇండియా సైతం జెట్‌ ఎయిర్‌వేస్‌ రూట్లలో తమ సర్వీసులను నడిపేందుకు ప్రయత్నిస్తోంది. నగదు సమస్యలతో సతమతమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఎమర్జన్సీ ఫండ్స్‌ను సమకూర్చేందుకు బ్యాంకర్లుమ నిరాకరించడంతో సంస్థ తన విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు