మరో 8 విమానాల కొనుగోలు: స్పైస్జెట్

15 Oct, 2016 00:48 IST|Sakshi
మరో 8 విమానాల కొనుగోలు: స్పైస్జెట్

హైదరాబాద్ నుంచి మరిన్ని
చిన్న పట్టణాలకు సేవలపై దృష్టి
కంపెనీ సీఎండీ అజయ్ సింగ్ వెల్లడి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కొత్తగా మరో ఎనిమిది దాకా విమానాలు సమకూర్చుకోనున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. వీటిలో మూడు బంబార్డియర్, నాలుగైదు బోయింగ్ విమానాలు ఉండగలవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వద్ద 43 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. నిత్యం 320 పైచిలుకు ఫ్లయిట్స్ నడుపుతున్నామని అజయ్ సింగ్ వివరించారు.

రోజువారీ ఫ్లయిట్స్ సంఖ్యను 10 శాతం మేర పెంచుకోనున్నట్లు తెలిపారు. శుక్రవారమిక్కడ యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్‌ఎల్‌ఓ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులకు ఆయన ఈ విషయాలు చెప్పారు. చిన్న పట్టణాలకు విమాన సేవలు అందించే విషయంలో తాము ముందుంటున్నామన్నారు. కొత్తగా హైదరాబాద్ నుంచి కాలికట్, భువనేశ్వర్, నాగ్‌పూర్ మొదలైన ప్రాంతాలకూ సర్వీసులు ప్రారంభించే అంశం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

అంతర్జాతీయంగా ప్రస్తుతం ఆరు దేశాలకు సర్వీసులు నడుపుతున్నామని, మరికొన్ని వారాల్లో కొత్తగా మరో రెండు, మూడు ప్రాంతాలకు కూడా సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కొత్తగా మరిన్ని విమానాలు కొనుగోలు చేసే దిశగా ఎయిర్‌బస్, బోయింగ్‌లతో చర్చలు జరుగుతున్నాయని, దాదాపు నెల రోజుల వ్యవధిలో తుది నిర్ణయం తీసుకోగలమని అజయ్ సింగ్ చెప్పారు. ఈ ఆర్డరు సుమారు వందకి పైగా విమానాలకు ఉండవచ్చని ఆయన సూచనప్రాయంగా పేర్కొన్నారు.

 చౌక చార్జీలే ఊతం..: దేశ జనాభాలో ప్రస్తుతం 2.5 శాతం మంది మాత్రమే విమానసేవలు వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఈ రంగంలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని అజయ్ సింగ్ చెప్పారు. ఈ ఏడాది విమాన టికెట్ల చార్జీలు సగటున 15-20% మేర తగ్గాయన్నారు. ప్రస్తుతం దేశీయంగా దాదాపు 400 విమానాశ్రయాలు ఉండగా.. వీటిలో 80 మాత్రమే పూర్తిస్థాయిలో వినియోగంలో ఉన్నాయని.. మిగతావీ అందుబాటులోకొస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు