స్పైస్‌జెట్‌ నష్టాలు రూ.38 కోట్లు

15 Aug, 2018 01:01 IST|Sakshi

ముంబై: విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో రూ.38 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.175 కోట్ల మేర నికర లాభం సాధించామని స్పైస్‌జెట్‌ తెలియజేసింది. ఇంధనం ధరలు అధికంగా ఉండటం, రూపాయి క్షీణించడం, రూ.64 కోట్ల మేర వన్‌ టైమ్‌ కేటాయింపుల కారణంగా ఈ క్యూ1లో నష్టాలొచ్చాయని స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ చెప్పారు. అయితే నికర ఆదాయం 20 శాతం పెరిగిందని తెలియజేశారు.

గత క్యూ1లో రూ.1,886 కోట్లుగా ఉన్న నికర ఆదాయం ఈ క్యూ1లో రూ.2,278 కోట్లకు పెరిగిందన్నారు. ఇంధన బిల్లు రూ.534 కోట్ల నుంచి రూ.812 కోట్లకు ఎగసిందని, రూ.51 కోట్ల మేర ఫారెక్స్‌ నష్టాలు వచ్చాయని వివరించారు. ఎబిటా 64 శాతం పతనమై రూ.84 కోట్లకు తగ్గిందని, ఎబిటా మార్జిన్‌ 8.7 శాతం తగ్గి 3.7 శాతానికి క్షీణించిందని వెల్లడించారు. ‘‘ఈ క్యూ1లో రికార్డ్‌ స్థాయి దేశీయ లోడ్‌ ఫ్యాక్టర్, 94.53 శాతాన్ని సాధించాం’’ అన్నారాయన.

ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్పైస్‌జెట్‌ షేర్‌ 0.8 శాతం క్షీణించి రూ.89 వద్ద ముగిసింది. ఆర్థిక ఫలితాలు వెల్లడించిన రెండో విమానయాన కంపెనీ ఇది. ఇటీవలే ఇండిగో కంపెనీ ఫలితాలు వెల్లడించింది. ఈ కంపెనీ నికర లాభం 97 శాతం హరించుకుపోయింది. కాగా మూడో లిస్టెడ్‌ కంపెనీ, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆడిట్, లిక్విడిటీ తదితర సమస్యల కారణంగా తన క్యూ1 ఫలితాలను నిరవధికంగా వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు