దూసుకెళ్లిన స్పైస్ జెట్ లాభం

8 Sep, 2016 00:29 IST|Sakshi
దూసుకెళ్లిన స్పైస్ జెట్ లాభం

క్యూ1లో రూ.149 కోట్లకు... రెండింతల వృద్ధి

 న్యూఢిల్లీ: దేశీయ చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ జూన్ త్రైమాసికంలో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. సంస్థ లాభం రెండింతలకు పైగా వృద్ధి చెంది రూ.149.03 కోట్లకు దూసుకెళ్లింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.72.97 కోట్లుగానే ఉంది. సాధారణంగా విమానయాన సంస్థలకు వేసవి కాలం పీక్ సీజన్. ఈ కాలంలో ప్రయాణికుల్లో వృద్ధి, అధిక ఆదాయాలతో లాభం ఈ స్థాయిలో పెరగడానికి తోడ్పడింది.

స్సైస్‌జెట్‌కు వరుసగా ఇది ఆరో త్రైమాసిక లాభం. ఇక సమీక్షా కాలంలో సంస్థ ఆదాయం సైతం రూ.1,113 కోట్ల నుంచి రూ.1521.53 కోట్లకు వృద్ధి చెందింది. ప్రయాణికుల భర్తీ 92.5 శాతంగా ఉన్నట్టు స్పైస్ జెట్ బీఎస్‌ఈకి తెలిపింది. సమయానుకూలంగా సేవల విషయంలో నిర్వహణ పనితీరును మెరుగుపరుచుకున్నట్టు, టికెట్ రద్దు చేసుకోవడాలు తగ్గినట్టు తెలిపింది. రూపాయి విలువ క్షీణత, ద్రవ్యోల్బణం, విమానాల లీజు భారం కావడం లాభాలపై ప్రభావం చూపాయని, సామర్థ్యం, ఆదాయ విస్తరణతో లాభంలో వృద్ధి సాధ్యమైనట్టు కంపెనీ వివరించింది.

మరిన్ని వార్తలు