కేంద్రానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక

27 Dec, 2014 00:31 IST|Sakshi
కేంద్రానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్..ప్రతిపాదిత 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఆధారంగా పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రానికి సమర్పించింది. స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న మాజీ ప్రమోటరు అజయ్ సింగ్‌తో కలసి కంపెనీ సీఓఓ సంజీవ్ కపూర్ శుక్రవారం పౌర విమానయాన శాఖ కార్యదర్శి వి.సోమసుందరన్‌కి ప్రణాళికను అందజేశారు.

సోమసుందరన్‌తో భేటీ నిర్మాణాత్మకంగా సాగిందని సమావేశం అనంతరం కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఏ చమురు మార్కెటింగ్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని, మొత్తం 18 విమానాలతో రోజుకు 230 ఫ్లయిట్ సర్వీసులు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. పునరుద్ధరణ ప్రణాళిక వార్తలతో బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేరు 9 శాతం పెరిగి రూ. 19.25 వద్ద ముగిసింది.

అజయ్ సింగ్‌తో పాటు అమెరికా ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ సారథ్యంలోని ఫండ్ కూడా స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. కంపెనీని గట్టెక్కించే దిశగా నెల రోజుల్లోగా 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో.. ప్రస్తుత ప్రమోటరు కళానిధి మారన్ నుంచి ఇన్వెస్టర్లు కొంత వాటా కొనుగోలు చేయనున్నారు.

ఇందులో భాగంగా కంపెనీకి ఇప్పటికే రూ. 17 కోట్లు అందినట్లు..  చమురు కంపెనీలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వాటితోనే తీర్చినట్లు సమాచారం.  నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 మధ్యలో దేశీ, విదేశీ విక్రేతలు, ఎయిర్‌పోర్ట్ ఆపరే టర్లు, చమురు కంపెనీలకు స్పైస్‌జెట్ చెల్లించాల్సిన బకాయిలు రూ. 990 కోట్ల నుంచి రూ.1,230 కోట్లకు పెరిగాయి. విదేశీ వెండార్లకు కంపెనీ చెల్లించాల్సిన బకాయిలు రూ. 624 కోట్ల నుంచి రూ. 742 కోట్లకు పెరిగాయి.

మరిన్ని వార్తలు