శ్రీసిటీలో జియోనీ ఫోన్ల తయారీ

12 Sep, 2015 01:43 IST|Sakshi
శ్రీసిటీలో జియోనీ ఫోన్ల తయారీ

- ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపిన కంపెనీ
- తయారీకి మూడేళ్లలో రూ.330 కోట్ల వ్యయం
- జియోనీ ఇండియా ఎండీ అరవింద్ వోరా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న జియోనీ ‘మేక్ ఇన్ ఇండియా’ బాటపట్టింది. మొబైల్స్ తయారీ సంస్థలైన ఫాక్స్‌కాన్, డిక్సన్ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటుతోపాటు డిక్సన్‌కు చెందిన నోయిడా ప్లాంటులో ఫోన్లు తయారు కానున్నాయి. అక్టోబరులో మేక్ ఇన్ ఇండియా తొలి ఉత్పాదన మార్కెట్లోకి రానుంది. ఫాక్స్‌కాన్ శ్రీసిటీ ప్లాంటులో మూడు అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 5 లక్షల యూనిట్లు. డిక్సన్ నోయిడా ప్లాంటులో 9 అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 7 లక్షల యూనిట్లు. రెండు ప్లాంట్ల వద్ద జియోనీ ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. వచ్చే మూడేళ్లలో తయారీకి రూ.330 కోట్లు ఖర్చు చేస్తామని జియోనీ ఇండియా ఎండీ అరవింద్ రజనీష్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.

భారత్ నుంచి విదేశాలకు: చైనాలోని సొంత ప్లాంటులో తయారైన ఫోన్లను జియోనీ దిగుమతి చేస్తోంది. ఇక నుంచి జియోనీ ఎఫ్ సిరీస్, పీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఫాక్స్‌కాన్ శ్రీసిటీ ప్లాంటులో తయారు చేస్తుంది. ఇతర స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లను డిక్సన్ ఉత్పత్తి చేయనుంది. దేశీయంగా తయారీ చేపట్టడం ద్వారా త్వరితగతిన కొత్త మోడళ్లను ఆవిష్కరించేందుకు కంపెనీకి వీలవుతుంది. అలాగే దిగుమతి సుంకాలు ఆదా అవుతాయి. ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. చైనా వెలుపల తయారీ కేంద్రంగా భారత్‌ను నిలుపుతామని జియోనీ ప్రెసిడెంట్ విలియం లూ పేర్కొన్నారు.

నెలకు ఒక మోడల్: భారత్ మార్కెట్లో నెలకు ఒక మోడల్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్టు అరవింద్ తెలిపారు.రూ.8,000 ఆపైన ధరలో వచ్చేవన్నీ 4జీ మోడళ్లని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఫోన్లను విక్రయిస్తామని వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తోపాటు ఇతర ఇ-కామర్స్ కంపెనీలతో కంపెనీ చర్చలు జరుపుతోంది.  గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్ల ఆదాయాన్ని జియోనీ ఇండియా ఆర్జించింది. ఈ ఏడాది రూ.6,000 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు