నాలుగైదేళ్లలో ఐపీవోకి..

13 Oct, 2018 00:49 IST|Sakshi

అప్పటికి  టర్నోవర్‌ రూ. 2,000 కోట్లకు

ప్రస్తుతం ఐఎఫ్‌సీ నుంచి రూ.150 కోట్ల నిధులు

శ్రీనివాస ఫారమ్స్‌ ఎండీ సురేష్‌ చిట్టూరి వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వచ్చే నాలుగైదేళ్లలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కి (ఐపీవో) రావాలని శ్రీనివాస ఫారమ్స్‌ యోచిస్తోంది. ప్రస్తుతం రూ. 750 కోట్లుగా ఉన్న టర్నోవర్‌ అప్పటికి రూ. 2,000 కోట్లకు చేరగలదని సంస్థ ఎండీ సురేష్‌ చిట్టూరి చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.1,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ‘వరల్డ్‌ ఎగ్‌ డే’ సందర్భంగా శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు.

తాజాగా ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) తమ సంస్థలో సుమారు రూ.150 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తోందని, దాదాపు 17–18 శాతం వాటాలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవడం, ప్రకాశం జిల్లాలో మెగా ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు తదితర కార్యకలాపాలకు ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. ఒంగోలులో రెండో ప్రాసెసింగ్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 4 కోట్ల లేయర్లు, 3 కోట్ల బ్రాయిలర్స్‌గా ఉన్న సంస్థ ఉత్పత్తి సామర్ధ్యం .. 2020 నాటికి 7.5 కోట్ల లేయర్లు, 5 కోట్ల బ్రాయిలర్స్‌కి చేరగలదని సురేశ్‌ చెప్పారు.  

గుడ్ల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు టాప్‌..
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం అత్యధికంగా ఉంటోందని ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌ వైస్‌–చైర్మన్‌ కూడా అయిన సురేష్‌ చెప్పారు. తెలంగాణలో తలసరి వార్షిక వినియోగం 130 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 120, తమిళనాడులో 110గా ఉంటోందని తెలియజేశారు.

‘‘తెలుగు రాష్ట్రాల్లో రోజూ 9 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. మార్కెట్‌ ఏటా 6–7 శాతం మేర వృద్ధి చెందుతోంది. దేశీ పౌల్ట్రీ పరిశ్రమ పరిమాణం దాదాపు రూ. 1,20,000 కోట్లు. దీన్లో గుడ్ల మార్కెట్‌ వాటా 33 శాతం’’ అని వివరించారు. గుడ్ల ప్రాధాన్యంపై అవగాహన పెంచే దిశగా తెలంగాణలో 20 ప్రభుత్వ పాఠశాలలకు వారంలో మూడు రోజులు పాటు గుడ్ల పంపిణీ చేస్తున్నట్లు సురేష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు