సెయింట్‌ గోబెయిన్‌ మరో ప్లాంటు

22 Mar, 2018 01:36 IST|Sakshi

పరిశీలనలో ఏపీ, తెలంగాణ

రూ.1,000 కోట్ల పెట్టుబడి

కంపెనీ ఫ్లాట్‌ గ్లాస్‌ ఎండీ సంతానం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్లాస్‌ తయారీ దిగ్గజం సెయింట్‌ గోబెయిన్‌ మరో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లేదా మహారాష్ట్రలో ఇది రానుంది. ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలతో ప్లాంటు విషయమై చర్చిస్తున్నట్టు సెయింట్‌ గోబెయిన్‌ ఇండియా ఫ్లాట్‌ గ్లాస్‌ ఎండీ బి.సంతానం చెప్పారు. బుధవారమిక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరోతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ యూనిట్‌కు రూ.1,000 కోట్లు వెచ్చిస్తామన్నారు. ‘రెండేళ్లలో తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తాం. 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది.  దశలవారీగా విస్తరణ చేపడతాం. ప్రభుత్వ సహకారం, ఆగ్నేయ భారత మార్కెట్‌కు అనువైన ప్రాంతం, ముడి సరుకు లభ్యత వంటి అంశాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకుంటాం’ అని తెలియజేశారు.

రూ.5,200 కోట్ల పెట్టుబడి..: భారత మార్కెట్లో 1996లో ప్రవేశించిన సెయింట్‌ గోబెయిన్‌ ఇప్పటి వరకు రూ.4,200 కోట్లు వెచ్చించింది. మరో రూ.1,000 కోట్లతో చెన్నైలో కొత్త ప్లాంటు నెలకొల్పుతోంది. చెన్నై ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. కంపెనీకి వార్షికంగా 14 కోట్ల చదరపు అడుగుల సెలెక్టివ్‌ హై పెర్ఫార్మెన్స్‌ కోటెడ్‌ గ్లాస్‌ తయారీ సామర్థ్యం ఉంది. 19 తయారీ ప్లాంట్లున్నాయి. రూ.10,000 కోట్ల టర్నోవర్‌తో గ్లాస్‌ ఇండస్ట్రీలో సెయింట్‌ గోబెయిన్‌ అగ్ర స్థానంలో ఉంది. బుల్లెట్‌ ప్రూఫ్, ఫైర్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ను భారత ప్లాంట్ల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 

మరిన్ని వార్తలు