హైదరాబాద్‌లో స్టార్‌బక్స్..

1 Oct, 2014 01:27 IST|Sakshi
హైదరాబాద్‌లో స్టార్‌బక్స్..

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కాఫీ ఆస్వాదించేందుకు భారతీయులు ఉత్సాహం కనబరుస్తున్నారని టాటా స్టార్‌బక్స్ అంటోంది. ఇక్కడి వారు చవక టీ తాగేవాళ్లు అన్న అభిప్రాయం చాలా కంపెనీలకు ఉంది. ఇదంతా తప్పని తమ అనుభవమే నిరూపిస్తోందని కంపెనీ సీఈవో అవని దావ్‌దా తెలిపారు. రెండేళ్లలోనే భారత్‌లో స్టార్‌బక్స్ 58 ఔట్‌లెట్లను ఏర్పాటు చే యడాన్నిబట్టి చూస్తే ప్రీమియం కాఫీకి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చని చెప్పారు.

విభిన్న కాఫీ రుచులతోపాటు అంతర్జాతీయ అనుభూతిని కస్టమర్లు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్కో స్టోర్ డిజైన్ దేనికదే ప్రత్యేకమని ఆమె వివరించారు. స్టార్‌బక్స్ స్టోర్‌ను మంగళవారమిక్కడి జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్టార్‌బక్స్ కాఫీ కంపెనీ, టాటా గ్లోబల్ బెవరేజెస్‌ల సంయుక్త కంపెనీయే స్టార్‌బక్స్. ఈ స్టోర్లలో కాఫీతోపాటు ఇతర ఆహారోత్పత్తులు విక్రయిస్తారు.

 12-15 శాతం వృద్ధి..
  భారతీయ కాఫీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని అవని చెప్పారు. వ్యవస్థీకృత రంగంలో పరిశ్రమ 12-15 శాతం వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తామని వెల్లడించారు. ‘50 నగరాలు మా రాడార్‌లో ఉన్నాయి. ఒక్కో నగరానికి ఎటువంటి రుచులను ఆఫర్ చేయాలి అన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నాం’ అని అన్నారు.

అగ్రస్థానానికి రావాలని అన్ని కంపెనీలకూ ఆశయం ఉంటుందని, ఇందులో స్టార్‌బక్స్ కూడా ఒకటని తెలిపారు. స్టోర్లలో కస్టమర్లకు ఉచిత వైఫై సౌకర్యమూ ఉంటుంది. హైదరాబాద్ ఫోరమ్ మాల్‌లోనూ స్టోర్ ఏర్పాటైంది. ముంబై, ఢిల్లీ, పునే, బెంగళూరు, చెన్నైలో స్టోర్లున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో విస్తరించింది.

మరిన్ని వార్తలు