అరకొర వైద్యం

23 Mar, 2015 02:25 IST|Sakshi

ఏజెన్సీలో వ్యాధుల కాలం ముంచుకొస్తోంది. రక్షిత నీటికి నోచుకోని ఆదివాసీ గూడేల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వర్షాలు మొదలైతే జలకాలుష్యం కోరల్లో చిక్కుకుని మలేరియా, డయేరియా వంటి వ్యాధులతో గిరిజనులు పిట్టల్లా రాలిపోవడం పరిపాటి. అయినా ప్రభుత్వ స్పందన నామమాత్రంగా ఉంటోంది.
 
పాడేరు:  మన్యంలో గిరిజనులు అరకొర వైద్యంతో అవస్థలు పడుతున్నారు. మారుమూల గ్రామాలకు వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏళ్ల తరబడి సమస్య కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదు. వైద్యసిబ్బంది కొరతతో ఆస్పత్రుల్లో వైద్యసేవలు కుంటుపడుతున్నాయి. పారామెడికల్ సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో లేరు. అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులకు వైద్యసేవలు అందడం లేదు. మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పినా, వైద్యసేవలు మాత్రం అందుబాటులో లేవు. ప్రధానంగా ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో వైద్యం అందని దుస్థితి.

రవాణా సమస్యలు గిరిజనులకు ఎన్నటికీ తీరడం లేదు. ఏజెన్సీలోని 51 డాక్టర్ పోస్టులకు ప్రస్తుతం 30 మందే ఉన్నారు. 14 మంది కాంట్రాక్టు వైద్యులను నియమించినప్పటికీ ఇంకా మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాడగడ, కిల్లోగుడ, పినకోట పీహెచ్‌సీలకు డాక్టర్లు లేరు. ఏజెన్సీలోని గెమ్మెలి, లబ్బూరు, రూఢకోట, కిలగాడ, కోరుకొండ, హుకుంపేట, ఉప్ప, ఆర్‌జేపాలెం తదితర మారుమూల పీహెచ్‌సీల్లో కాంట్రాక్టు వైద్యులే పని చేస్తున్నారు.

వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు ఏళ్ల తరబడి భర్తీ కావడం లేదు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు, హెల్త్ సూపర్‌వైజర్లతో కలిపి వివిధ కేటగిరిల్లో మొత్తం 161 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గ్రామాల్లో  ఆశ వర్కర్ పోస్టులు కూడా 41 ఖాళీలు భర్తీ చేయడం లేదు. దాదాపు సగం వరకు వైద్యసిబ్బంది ఖాళీలు ఉన్నా ప్రభుత్వం వీటిని భర్తీ చేయడంపై ఎటువంటి శ్రద్ధ చూపడం లేదు. ప్రస్తుతం పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది కాంట్రాక్టు వైద్యసిబ్బందే. ఏళ్లతరబడి మన్యంలో సేవలందిస్తున్నా.. రెగ్యులర్‌కు నోచుకోని పరిస్థితి. ప్రభుత్వం తీరుతో మన్యంలో వైద్య సేవలు కుంటుపడుతున్నాయి.

చిన్నారులకు విషజ్వరాలు
డుంబ్రిగుడ: మండలంలోని అరమ పంచాయతీ జోడిమామిడి గ్రామం లో చిన్నారులు వారం రోజులుగా విషజ్వరాల లక్షణాలతో విలవిల్లాడుతున్నారు. జ్వరం వచ్చిన వెంటనే వాంతులు,విరేచనాలకు గురవుతున్నారు. గ్రామంలో బుర్డి సమిర(1),బుర్డి జగన్(2),కె ఇసాక్(2),కె అరుణ(2),బి మౌనిక(1),బి రూత్తు(3), జి నీలన్న(1)లతోపాటు మరికొందరు ప్రస్తుతం మంచానపడి ఉన్నారు. వైద్యసిబ్బంది జాడలేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలోని చిన్నారులు పౌష్టికాహారానికి నోచుకోవడం లేదు. బక్కచిక్కిపోతున్నారు. సుమారు 20 మంది చిన్నారులు ఉన్నప్పటికీ ఇక్కడ అంగన్వాడీ కేంద్రం లేదు.  

>
మరిన్ని వార్తలు