ఆన్‌లైన్‌... జస్ట్‌ 5 నిమిషాల్లో!!

16 Sep, 2017 01:18 IST|Sakshi
ఆన్‌లైన్‌... జస్ట్‌ 5 నిమిషాల్లో!!

వెబ్‌సైట్, యాప్‌ అభివృద్ధి సేవలందిస్తున్న నౌఫ్లోట్స్‌
► 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్‌ఎంఈ కస్టమర్లు
► ఇప్పటివరకు రూ.76 కోట్ల సమీకరణ
► ‘స్టార్టప్‌ డైరీ’తో నౌఫ్లోట్స్‌ కో–ఫౌండర్‌ జస్మిందర్‌ సింగ్‌ గులాటీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆఫ్‌లైన్‌ సంస్థలు ఆన్‌లైన్‌ వ్యాపారంలోకి రావాలంటే వెబ్‌సైటో లేక యాపో కావాలి. అలాగని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు (ఎస్‌ఎంఈలు) వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయటం, నిర్వహించటం కష్టం. మరెలా? దీనికి పరిష్కారం చూపిస్తోంది హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న నౌఫ్లోట్స్‌.కామ్‌. మన దేశంలోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా వంటి 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్‌ఎంఈల వెబ్‌సైట్లను నిర్వహిస్తోందీ సంస్థ. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్‌ జస్మిందర్‌ సింగ్‌ గులాటీ మాటల్లోనే..

స్నేహితులు రోనక్‌ కుమార్‌ సమంత్రాయ్, నీరజ్‌ సబర్వాల్, నితిన్‌ జైన్‌తో కలిసి 2012లో రూ.80 లక్షల పెట్టుబడితో ‘నౌఫ్లోట్స్‌’ను ప్రారంభించాం. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌ చాలెంజ్‌ అవార్డు గ్రాంట్‌ను రూ.15 లక్షలు గెలుచుకున్నాం. ఇదే నౌఫ్లోట్స్‌కు ప్రారంభ పెట్టుబడి.

11 పేటెంట్ల కోసం దరఖాస్తు..
చిన్న, మధ్యతరహా సంస్థలు, కూరగాయల షాపు, కిరాణా, మందుల దుకాణాలు వంటి చిన్న చిన్న షాపులు కూడా వారి వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించుకునేందుకు వీలుగా వెబ్‌సైట్, యాప్‌లను అభివృద్ధి చేసి నిర్వహిస్తాం. వీటితో పాటు మార్కెటింగ్, పేమెంట్‌ గేట్‌వే కూడా అందిస్తాం. అంటే ఎస్‌ఎంఈల తరుఫున ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని నౌఫ్లోట్సే చేస్తుందన్న మాట. అంతేకాక కస్టమర్లు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ కోసం వెతికినప్పుడు వారి తాలుకు సర్వే వివరాలను, సామాజిక మాధ్యమాల రిపోర్ట్‌లను కూడా ఎస్‌ఎంఈలకు అందిస్తాం. బిగ్‌ డేటా ఆల్గోరిథం, ప్రాంప్టింగ్‌ వంటి 11 టెక్నాలజీల్లో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం.

50 దేశాలు.. 2.5 లక్షల ఎస్‌ఎంఈలు..
వెబ్‌సైట్, యాప్‌ అభివృద్ధికి 5 నిమిషాల సమయం పడుతుంది. ఏడాదికి వార్షిక ఫీజు రూ.25 వేలు. మన దేశంతో పాటూ ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, ఫిలిప్పీన్స్, టర్కీ వంటి 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్‌ఎంఈల వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం దేశంలో 7 లక్షల ఎస్‌ఎంఈ వెబ్‌సైట్లుండగా.. వీటిలో 1.4 లక్షల వెబ్‌సైట్లను మేమే నిర్వహిస్తున్నాం. తయారీ, రిటైల్, వైద్య రంగంలో ఎక్కువ కస్టమర్లున్నారు. మరో నెల రోజుల్లో సిమ్లా, పుదుచ్చేరి, విశాఖపట్నం, హంపి వంటి టూరిస్ట్‌ హబ్స్‌లో నౌఫ్లోట్స్‌ సేవలను విస్తరిస్తున్నాం.

6 నెలల్లో రూ.5 కోట్ల సమీకరణ..
2016–17 ఆర్ధిక సంవత్సరంలో రూ.20 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రూ.50 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మాకు దేశంలో 65 కార్యాలయాలు, 900 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు ఐరన్‌ పిల్లర్‌ అండ్‌ ఐఐఎఫ్‌ఎల్, ఓమిడయ్యర్, బ్లూమీ వెంచర్స్, హైదరాబాద్, ముంబై ఏంజిల్స్‌ నుంచి రూ.76 కోట్ల నిధులను సమీకరించాం. మరో 6 నెలల్లో రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం.

మరిన్ని వార్తలు